
తెలంగాణ పదో తరగతి (ఎస్ఎస్సి) పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరీక్షల అనంతరం ఫలితాల ప్రకటనకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ వేగంగా పనులు పూర్తి చేస్తోంది. ప్రస్తుతం ఫలితాల తేదీ దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. అధికారికంగా ఎప్పుడెప్పుడు ఫలితాలు విడుదల అవుతాయో, ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల కాగా, తెలంగాణలో ఇంటర్‌తో పాటు పదో తరగతి ఫలితాల విడుదలపై కూడా ఉత్కంఠ నెలకొంది. రెండు పరీక్షల ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.
ఈ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయి. అనంతరం ఏప్రిల్ 7న ప్రారంభమైన మూల్యాంకనం ఏప్రిల్ 15 వరకూ కొనసాగనుంది. ఈ దశ ముగిశాక, పరీక్ష పత్రాల రీ చెకింగ్, మార్కుల డేటా ఎంట్రీ వంటి ప్రక్రియలు మొదలవుతాయి. ఈ అన్ని పనులు పూర్తయ్యేందుకు మరో 10 రోజులు పడే అవకాశం ఉంది.
విద్యాశాఖ అధికారులు ప్రస్తుత లెక్కల ప్రకారం, ఏప్రిల్ 28 నుంచి 30 మధ్యలో ఎస్ఎస్సి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన ఖచ్చితమైన తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
ఫలితాలు వెలువడిన తర్వాత విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే, కొన్ని ప్రైవేట్ విద్యా పోర్టల్స్ మరియు మొబైల్ యాప్‌ల ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయి.
పదో తరగతి పరీక్ష ఫలితాలను చెక్ చేసుకునేందుకు రెండు వెబ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి అందులో ఒకటి తెలంగాణ పదో తరగతి బోర్డ్ అధికారిక వెబ్ సైట్ https://bse.telangana.gov.in కాగా రెండవది మనబడి వెబ్ సైట్ https://www.manabadi.co.in.