spot_img
spot_img
HomePolitical NewsAndhra Pradeshఎక్కడా చెత్త కనిపించకూడదు – ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీ చేస్తా: సీఎం చంద్రబాబు హెచ్చరిక.

ఎక్కడా చెత్త కనిపించకూడదు – ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీ చేస్తా: సీఎం చంద్రబాబు హెచ్చరిక.

పారిశుద్ధ్య పనులు జరగకపోతే అధికారులదే బాధ్యత. తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.

ఆంధ్రప్రదేశ్‌ మునుపటి ప్రభుత్వం పూర్తిగా విధ్వంసం చేసి వెళ్లిందని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాము అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, పరిశుభ్రతపై అధికారులకు కఠిన సూచనలు చేశారు.

“గత ప్రభుత్వంలో సీఎం ఎప్పుడైనా ప్రజల్లోకి వచ్చారా?” అని చంద్రబాబు ప్రశ్నించారు. “ప్రజల మధ్యకు వచ్చినా పరదాలు కట్టుకుని వచ్చేవారు. విమానంలో వచ్చినా చెట్లు నరిపించుకుంటూ వచ్చేవారు. ప్రజల సమస్యలు వినేందుకు ఆసక్తి చూపించేవారు కాదు” అని విమర్శించారు. “మేము ప్రజా ప్రభుత్వం. ప్రజల కోసం పాలనలో సంస్కరణలు తీసుకొస్తున్నాం. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి వెళ్లింది. ఇప్పుడు ఆ అప్పు వడ్డీతో సహా తీర్చాల్సిన పరిస్థితి ఉంది” అని వ్యాఖ్యానించారు.

“గత ప్రభుత్వం కాలువల్లో పూడిక తీయించలేదు. 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు కంకణం కట్టుకోవాలి” అని చంద్రబాబు అన్నారు. “ఏ ఊరికి వస్తానో ముందుగా చెప్పను. అకస్మిక తనిఖీలు చేస్తాను. చెత్త కనిపిస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయి” అని హెచ్చరించారు.

“పేదల పింఛన్ రూ.3,000 నుంచి రూ.4,000కి, దివ్యాంగుల పింఛన్ రూ.3,000 నుంచి రూ.6,000కి పెంచాం. తొలిసారిగా మధ్య తరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నాం. ప్రజల ఆదాయం పెంచే విధంగా ‘స్వర్ణాంధ్ర 2047’ పేరుతో స్పష్టమైన విధానం తీసుకొచ్చాం” అని తెలిపారు.

“గతంలో ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్లు నిర్మించాం. ఇప్పుడు కొత్తగా మరో 4.6 లక్షల మరుగుదొడ్లు నిర్మించబోతున్నాం” అని సీఎం తెలిపారు. “రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చేందుకు ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలి” అని పిలుపునిచ్చారు. పరిశుభ్రతకే ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆయన సూచించారు.

Author

Date

Category

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent posts

Recent comments