
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన విశిష్టమైన దర్శకత్వ శైలి మాత్రమే కాకుండా, తన నటనతో కూడా అభిమానులను ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు హిందీ సినిమాలతో పాటు, తమిళ, మలయాళ చిత్రాలలోనూ నటించిన అనురాగ్, ఇప్పుడు తెలుగులోకి అడుగుపెడుతున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డకాయిట్’ అనే సినిమా ద్వారా అనురాగ్ టాలీవుడ్లో తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇది తెలుగు ప్రేక్షకులకు ఆసక్తికరమైన వార్తగా మారింది.
అనురాగ్ కశ్యప్ గతంలో అతిథి పాత్రలతోపాటు, కొన్ని కీలకమైన పాత్రలు కూడా పోషించాడు. 2018లో తమిళ చిత్రసీమలో ‘ఇమైక్కా నోడిగల్’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన అనురాగ్, ఆ తర్వాత విజయ్ నటించిన ‘లియో’ చిత్రంలో అతిథి పాత్రలో మెరిసాడు. ‘మహారాజ, విడుదలై-2’ వంటి తమిళ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. అంతేకాదు, గత ఏడాది మలయాళ ఇండస్ట్రీలో ‘రైఫిల్ క్లబ్’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. అయితే, తెలుగు ఇండస్ట్రీలో అతనికి అవకాశాలు రావడానికి ఎక్కువ సమయం పట్టిందని చెప్పాలి.
అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘డకాయిట్’ సినిమాతో అనురాగ్ కశ్యప్ తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతీహాసన్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఆమె స్థానంలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంపికయ్యారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సునీల్ నారంగ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్ ఇన్స్పెక్టర్ స్వామి అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్న గెటప్‌లో అనురాగ్ కనిపించేలా మేకర్స్ ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. దర్శకుడు షానీల్ డియో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా, కథ, కథనాలను అడివి శేష్ స్వయంగా అందించడమే విశేషం. అనురాగ్ కశ్యప్ పాత్ర సినిమాలో కీలక మలుపులను తిప్పేలా ఉండబోతుందని సమాచారం.
‘డకాయిట్’ సినిమాతో అనురాగ్ కశ్యప్ టాలీవుడ్లో తన మార్క్ నెలకొల్పగలడా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్, మలయాళ ఇండస్ట్రీల్లో తన పాత్రలకు మంచి పేరు తెచ్చుకున్న అనురాగ్, తెలుగు ప్రేక్షకులకు తన నటనతో కొత్త అనుభూతిని కలిగించనున్నాడని భావిస్తున్నారు. మరి, ఈ సినిమా విజయవంతమైన తర్వాత, టాలీవుడ్లో మరిన్ని అవకాశాలు అనురాగ్‌ను వెతుక్కుంటూ వస్తాయా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.