
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో అఫ్గానిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జాద్రాన్ అరుదైన రికార్డును సృష్టించాడు. ఫిబ్రవరి 26న లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఎనిమిదో మ్యాచ్‌లో జాద్రాన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శించాడు. 146 బంతుల్లో 177 పరుగులు చేసి, తన దూకుడు చూపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 12 బౌండరీలు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో, ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, ఆరంభంలోనే ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. దీంతో అఫ్గానిస్థాన్ 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తక్కువ స్కోర్‌కే ఆలౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇబ్రహీం జాద్రాన్ క్రీజులో నిలిచి అద్భుతంగా ఆడాడు.
కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (40; 67 బంతుల్లో)తో కలిసి జాద్రాన్ నాలుగో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. షాహిదీ ఔటైన తర్వాత కూడా జాద్రాన్ తన దూకుడును తగ్గించకుండా బ్యాటింగ్ కొనసాగించాడు. చివరి ఓవర్లలో అజ్ముతుల్లా (41; 31 బంతుల్లో), మహ్మద్ నబీ (40; 24 బంతుల్లో) కూడా చెలరేగి ఆడటంతో అఫ్గానిస్థాన్ బలమైన స్కోర్ అందుకుంది.
అఖరి ఓవర్లో, తొలి బంతికే జాద్రాన్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయినప్పటికీ, అతని ఇన్నింగ్స్ అఫ్గానిస్థాన్‌కు మంచి స్కోర్ అందించడానికి తోడ్పడింది. మొత్తం 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 325 పరుగులు చేయగలిగింది. ఈ ఇన్నింగ్స్‌తో ఇబ్రహీం జాద్రాన్ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు ఈ ఘనత ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డకెట్‌కు (165 పరుగులు, ఆస్ట్రేలియాపై) చెందినది. కానీ, జాద్రాన్ 177 పరుగులు చేసి ఆ రికార్డును అధిగమించాడు. ఈ ఇన్నింగ్స్ అఫ్గానిస్థాన్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉంది.