
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), హెల్త్‌కేర్, తయారీ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. ఈ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా భారత్ హెల్త్‌కేర్ మరియు ఫార్మాస్యూటికల్ రంగాల్లో కీలక భూమిక పోషిస్తున్నదనే దానికి నిదర్శనమని అన్నారు.
హైదరాబాద్ కేవలం ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీ హబ్‌గా గుర్తింపు పొందిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఆస్పత్రులు, లైఫ్‌సైన్సెస్, బయోటెక్నాలజీ రంగాల్లో నగరం కీలకంగా మారిందని వివరించారు. 22వ బయో ఆసియా – 2025 వంటి గ్లోబల్ ఈవెంట్లు నగరంలో జరుగుతున్నాయని, ఇది హెల్త్‌కేర్ రంగం అభివృద్ధికి సహాయపడుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి, వినూత్న ఆవిష్కర్తలకు బహుమతులు అందజేశారు. భారత్ ప్రపంచానికి అవసరమైన ఔషధాలు, జెనరిక్ మందులను సరఫరా చేస్తోందని, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో దేశం మూడో స్థానంలో ఉందని తెలిపారు. గత దశాబ్దంలో ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ రెట్టింపు అయ్యిందని వివరించారు.
భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం ముందుంచిందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో తీసుకొచ్చిన విధానాలు, జీఎస్టీ అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర సంస్కరణల వల్ల దేశం గణనీయమైన పురోగతి సాధించిందని వివరించారు.
హైదరాబాద్‌లో ఫార్మా రంగానికి కేంద్ర ప్రభుత్వం బలమైన మద్దతునిస్తోందని, ఇక్కడ 800కి పైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలు పనిచేస్తున్నాయని తెలిపారు. మెడ్‌టెక్ మిత్ర వంటి కేంద్ర పథకాలు పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతున్నాయని, అంతర్జాతీయ భాగస్వామ్యంతో హెల్త్‌కేర్ రంగాన్ని మరింతగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.