
23 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ యువతి జాహ్నవి దంగేటి భారత అంతరిక్ష చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాయనున్నారు. ఆమెను 2029లో టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించనున్న ఆర్బిటల్ స్పేస్ మిషన్‌కు ఎంపిక చేశారు. ఈ మిషన్‌లో భాగంగా ఆమె ఐదు గంటల పాటు అంతరిక్షంలో ప్రయాణించి రెండు సూర్యోదయాలు, రెండు సూర్యాస్తమయాలు చూడనున్నారు. జాహ్నవి NASA ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసిన తొలి భారతీయురాలిగా పేరు పొందారు.
ఈ మిషన్‌కు రిటైర్డ్ NASA వ్యోమగామి, యుఎస్ ఆర్మీ కల్నల్ విలియం మెక్‌ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు. ఇది పూర్తిగా శాస్త్రీయ పరిశోధనలపై ఆధారపడి ఉండనుండగా, మానవ అంతరిక్ష ప్రయోగాలకు కీలకంగా మారనుంది. జాహ్నవి ఐదు గంటల అంతరిక్ష ప్రయాణంలో మూడు గంటలు సున్నా గురుత్వాకర్షణ అనుభవించనున్నారు. భూమి చుట్టూ రెండు రౌండ్లు వేయనున్న ఈ ప్రయాణంలో ఆమె అనుభవాలు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి.
జాహ్నవికి ఖగోళ శాస్త్రం, STEM రంగాలపై ఉన్న ఆసక్తి ఆమెను ఈ దిశగా నడిపించింది. NASA క్యాంప్‌లో ఆమె టీమ్ కెన్నెడీకి మిషన్ డైరెక్టర్‌గా వ్యవహరించి అంతర్జాతీయ బృందంతో విజయవంతమైన రాకెట్ ప్రయోగాన్ని అనుకరించారు. జీరో గ్రావిటీ ట్రైనింగ్, స్పేస్ సూట్ ఆపరేషన్, ప్లానెటరీ సిమ్యులేషన్ లాంటి విభాగాల్లో ఆమె శిక్షణ పొందారు.
2026లో ఆమె టైటాన్స్ స్పేస్ ఆస్ట్రోనాట్ క్లాస్‌లో అధికారిక శిక్షణ ప్రారంభించనున్నారు. ఇందులో మానసిక ధృఢత్వం, అత్యవసర పరిస్థితుల్లో వ్యవహరించగల సామర్థ్యం, ఆరోగ్య సంబంధిత అంశాలపై సమగ్ర శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ ద్వారా ఆమె అంతరిక్షయాత్రకు సిద్ధమవుతారు.
జాహ్నవి ఈ అవకాశాన్ని తన వ్యక్తిగత కలగా కాకుండా, దేశ యువతకి ప్రేరణగా భావిస్తున్నారు. “అసాధ్యాన్ని ఊహించగల ప్రతీ ఒక్కరికీ ఇది ఒక సంకేతం” అని ఆమె పేర్కొనడం గర్వంగా మారింది. తెలుగమ్మాయి చేసిన ఈ ఘనత దేశానికే గర్వకారణంగా నిలుస్తోంది.


