
రానున్న వందేళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్‌కు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) సమీపంలో సరైన ప్రాంతంలో డ్రైపోర్ట్ (Dry Port) ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, RRR పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు.
ఇటీవల రాష్ట్ర పునర్విభజన అంశాలపై ఢిల్లీలో జరిగిన తెలంగాణ, ఏపీ అధికారుల సమావేశంలో హైదరాబాద్ – విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి సూత్రప్రాయ ఆమోదం తెలపాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించిన నేపథ్యంలో ఆ పనులపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.

రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని, దక్షిణ భాగం డీపీఆర్ కన్సల్టెన్సీ నివేదికను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌తో అనుసంధానించేలా జాతీయ రహదారికి ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థకు (NHAI ) పంపించాలని ముఖ్యమంత్రి గారు సూచించారు.
హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి గారు ఆరా తీశారు. పలు చోట్ల పంటలు ఉన్నాయని, పంట నష్టపరిహారం చెల్లించేందుకు NHAI అంగీకరించడం లేదని అధికారులు వివరించారు.

పంట కాలం దాదాపు పూర్తవుతున్నందున ఆ వెంటనే రైతులతో మాట్లాడి భూ సేకరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారు తెలిపారు. భూ సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడాలని, సాంకేతిక, న్యాయ సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సూచించారు.
ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజినల్ రింగు రోడ్డు వరకు రేడియల్ రోడ్లు, ఆర్ఆర్ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు ఉన్న రహదారుల విస్తరణపైనా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారితో పాటు ఆర్ అండ్ బీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.