
హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తుతోంది. ముఖ్యంగా కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి 11 గంటల వరకు వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులంతా అప్రమత్తమయ్యారు. ప్రజలు అవసరం లేకుండా ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎలాంటి అపరిస్థితేనైనా ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
మంగళవారం నాటి పరిస్థితిని చూస్తే, రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి వర్షం నమోదైంది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసాయి. జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాల్లో వర్షాలు తేలికపాటుగా ప్రారంభమయ్యాయి. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు కూడా వీచుతున్నాయి.
జూలై 2న ఎక్కువగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజులలో ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ వంటి జిల్లాల్లో వర్షాలు మరింత తీవ్రంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం. బయటకు వెళ్లాల్సి వచ్చినా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. నీటమునిగే ప్రాంతాల్లో సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ సమయంలో ఎలాంటి పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది.


