
డా. వజ్రనాభ నటరాజ్ మహర్షి యొక్క ఫోటో ప్రదర్శన మరియు చిత్రకారుడు విజయకుమార్ సోమంచిపై తీసిన వజ్రాణాభ్ నటరాజ్ మహర్షి రూపొందించిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘మిస్టిక్ మౌంటెన్ స్కేప్స్’ టీజర్ ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత & సాంస్కృతిక కమిషన్ సహకారంతో గుంటూరులోని కళాపీఠం, హిందూ ఇంజనీరింగ్ & టెక్నాలజీ కళాశాల (సుధర్మ) ఆడిటోరియంలో 2025 ఫిబ్రవరి 14 నుంచి 18 వరకు నిర్వహించారు.

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, ఫోటోగ్రాఫర్ మహర్షి ఇప్పటి వరకూ మనుషుల జీవన విధానం పై పలు ఎగ్జిబిషన్స్ నిర్వహించగా,ఇప్పుడు మొదటిసారిగా వలస పక్షుల జీవన విధానాన్ని మనముందుకు తీసుకురావడం అభినందనీయం.కొల్లేరు వలసపక్షులను ,వాటి ఎమోషన్స్ని చిత్రాకరించడం చల్లెంజింగా అనిపించిందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని కళాపీఠం కార్యదర్శి శ్రీ విజయకుమార్ ప్రారంభించి, అతిథులకు స్వాగతం పలికారు. డా. మహర్షి కోల్లేరు సరస్సులోని వివిధ జలపక్షులను చిత్రీకరిస్తూ ఎదుర్కొన్న సవాళ్లను వివరించారు. ఈ ప్రకృతి అద్భుతాన్ని పర్యాటకులకు పరిచయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. కళాపీఠం వివిధ కళాకారులకు అందించిన సహాయాన్ని, నిర్వహించిన ప్రదర్శనల ద్వారా వారి కళను గుర్తింపు కల్పించిన విధానాన్ని వివరించారు. అలాగే, ఒక శాశ్వత కళా గ్యాలరీ అవసరాన్ని మరియు కళా అకాడమీ స్థాపన యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ముఖ్య అతిథులు ప్రముఖ ఛాయాగ్రాహకుడు శ్రీ ఎం.వి. రఘు (స్వాతి ముత్యం, సిరివెన్నెల వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసినవారు) ఛాయాగ్రహణ కళలోని విలువలను, కెమెరా మాంత్రికుడు డా. మహర్షి యొక్క ప్రత్యేక దృశ్యకోణాన్ని ప్రశంసించారు.అనంతరం శ్రీ అట్లూరి నారాయణరావు (ఎన్టీఆర్ సాహిత్య కమిషన్ కన్వీనర్) కమర్షియల్ ఒత్తిళ్లను అధిగమించి, కళాకారులు తమ అభిరుచిని అనుసరించాలి అని వ్యాఖ్యానించారు. శ్రీ ఆర్. మల్లిఖర్జునరావు (ఏపీ రాష్ట్ర సృజనాత్మకత & సాంస్కృతిక కమిషన్ సీఈఓ) కోల్లేరు సరస్సు పరిరక్షణపై ప్రసంగించారు.

ఈ కార్యక్రమ ప్రధాన అతిధి కళాపీఠం అధ్యక్షుడు శ్రీ ఎస్.వి.ఎస్. లక్ష్మీనారాయణ యువత కళా ప్రదర్శనల ద్వారా స్ఫూర్తి పొందాలని సూచించారు. కోల్లేరు సరస్సుకు వలస పక్షులు శతాధిక మైళ్ళ దూరం ప్రయాణించి, ఇక్కడ తమ కుటుంబాలను పెంచుకునే విధానాన్ని వివరించారు. డా. మహర్షి తీయించిన చిత్రాల్లో పక్షుల భావోద్వేగాలను పట్టుకోవడంలో అతని నైపుణ్యం అపూర్వమని ప్రశంసించారు.

చివరిగా ‘జాతి రత్నాలు’ ఫేమ్ శ్రీ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ గూగుల్ మ్యాప్స్ లేకుండా గల్లీ కూడా దాటలేని పరిస్థితుల్లో మనం ఉంటే,నోరు లేని పక్షులు ఖండాలు దాటి మన ప్రాంతాలకి వచ్చి ప్రత్యుత్పత్తి ప్రక్రియ పూర్తి చేసుకుని, వాటి సంతానాన్ని వృద్ధి చేసుకునే పవిత్ర స్థలం మన కళ్ళముందు ఉన్న కొల్లేరు సరస్సు. కాలక్రమేణా కాసుల కోసం మనం సృష్టించుకున్న కాలుష్యం తో ఇప్పుడు ఆ సరస్సు సురక్షణ శూన్యం గా మారిపోయింది. కాబట్టి యువత పర్యావరణ పరిరక్షణలో ముందుకు రావాలని సూచించారు. మన దేశానికి ఉన్న ప్రకృతి వైభవాన్ని గర్వంగా భావించి కాపాడాల్సిన బాధ్యత మనదని తెలిపారు.

డా. మహర్షి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, కళాపీఠం, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్, కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఫోటోగ్రఫీ ఎథిక్స్, పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. మనిషి స్వార్థం ప్రకృతిని ఎలా దెబ్బతీస్తుందో తెలియజేశారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ,మానవాళి భవిష్యత్తు కోసం సహనంతో ప్రేమతో జీవించాలని సూచించారు.
