
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనలేకపోయిన వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన రీసర్వే నిర్వహిస్తోంది. మొదటిసారి సర్వేలో వివరాలు నమోదు చేసుకోని వారు ఈ రీసర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. ఈసారి ప్రజలు తమ వివరాలు మరింత సులువుగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వేను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా మూడు లక్షల కుటుంబాలకు పైగా పాల్గొనలేదు. ఇటీవల అసెంబ్లీలో కులగణన సర్వే రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులోని గణాంకాలపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో సర్వేనే నిర్వహించలేదన్న ఆరోపణలు వచ్చాయి. వివిధ కారణాలతో సర్వేలో పాల్గొనలేదంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. దీంతో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు కులగణన రీసర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
కులగణన రీసర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఫిబ్రవరి 16 నుంచి జరిగే రీసర్వే కోసం జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో 040-21111111 నెంబర్‌తో ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పనిచేస్తుంది. ఇప్పటి వరకు కులగణనలో పాల్గొనని కుటుంబ సభ్యులు మాత్రమే కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
కేవలం కాల్ సెంటర్ ద్వారానే కాకుండా ఈసారి ఆన్‌లైన్ ద్వారా కూడా సర్వేలో పాల్గొనవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనూ తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే ఎన్యూమరేటర్లను ఇంటికే పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లాంటి ముఖ్య విపక్ష నేతలు ఈ సర్వేలో పాల్గొనకపోవటంతో మరోసారి నిర్వహిస్తున్న ఈ రీసర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. గతేడాది నవంబర్ 9న రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన సర్వేను ప్రారంభించి సుమారు 50 రోజుల పాటు ప్రజల వివరాలను సేకరించారు. ఫిబ్రవరి 4న ఉదయం సర్వే రిపోర్టుపై కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీలో కులగణన నివేదికను ప్రవేశపెట్టారు. అనంతరం సభలో దీనిపై చర్చించారు. ఈ కుల గణన నివేదిక ప్రకారం తెలంగాణలో రాష్ట్ర జనాభా 3,54,77,554గా ఉంది. ఇందులో మొత్తం 1,12,15,134 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో బీసీల జనాభా 1,64,09,179 మంది ఉన్నారు. ఇది మొత్తం జనాభాలో 46.25 శాతం. ఎస్సీలు 61,84,319 మంది ఉన్నారు. ఈ సంఖ్య మొత్తం జనాభాలో 17.43 శాతం, ఎస్టీలు 37,05,929 మంది ఉండగా మొత్తం జనాభాలో 10.45 శాతం ఉంటుంది. ముస్లింలను రెండు వర్గాలుగా విభజించారు. బీసీ ముస్లింలు 35,76,588 అంటే 10.85 శాతం, ఓసీ ముస్లింలు 8,80,424 మంది అంటే 2.48 శాతం ఉన్నారు. మొత్తం ముస్లిం జనాభా తెలంగాణలో 12.56 శాతం. ఓసీల జనాభా శాతం 15.79 శాతంగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది.