
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, పదో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2026 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది. విద్యార్థులపై ఉన్న పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు, వారికి మెరుగైన అవకాశాలను అందించేందుకు ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ కొత్త విధానం ప్రకారం, ఫిబ్రవరిలో జరిగే మొదటి విడత పరీక్షలు తప్పనిసరిగా ఉండనున్నాయి. విద్యార్థులంతా ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. మే నెలలో నిర్వహించే రెండో విడత పరీక్షలు ఆప్షనల్‌గా ఉంటాయి. అంటే, మొదటి విడతలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, తమ స్కోర్‌ను మెరుగుపరచుకోవాలనుకునే వారు మేలో నిర్వహించే పరీక్షలో పాల్గొనవచ్చు. చివరకు, రెండు విడతలలో ఉత్తమ ఫలితాన్ని CBSE పరిగణనలోకి తీసుకుంటుంది.
ఈ విధానం జాతీయ విద్యా విధానం (NEP) – 2020కి అనుగుణంగా రూపొందించబడింది. NEPలోని లక్ష్యం – విద్యార్థుల్లో అభ్యాస పట్ల ఆసక్తిని పెంచడం, పరీక్షల భయాన్ని తగ్గించడం. ఈ నిర్ణయం ద్వారా విద్యార్థులు ఒకే విద్యా సంవత్సరం లో రెండవ అవకాశం పొందగలుగుతారు. ఇది వారి నైపుణ్యాల్ని మెరుగుపరుచుకునేందుకు, సానుకూల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడుతుంది.
CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఫిబ్రవరి, మేలో రెండు దశల పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్ నెలల్లో విడుదలవుతాయి. శీతాకాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రెండు దశలలో ఏదైన పరీక్షలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందన్నారు. అంతర్గత మూల్యాంకనం మాత్రం ఒక్కసారే జరుగుతుందని తెలిపారు.
ఇది విద్యా రంగంలో ఒక సానుకూల మార్పుగా భావించబడుతోంది. ముసాయిదా నిబంధనలను ఫిబ్రవరిలోనే విడుదల చేసిన CBSE, పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంది. గత నెలలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ విధానం గురించి ప్రకటన చేశారు. పరీక్షల ఒత్తిడిని తగ్గిస్తూ, విద్యార్థులకు మెరుగైన అభ్యాస వాతావరణాన్ని కల్పించేందుకు ఇది ఒక మంచి ముందడుగుగా భావిస్తున్నారు.


