
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో జరిగిన అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా స్వాతంత్ర్యానికి గల చరిత్ర, ప్రాముఖ్యతను గుర్తుచేస్తూ, అది ప్రపంచ రాజకీయ దిశను మార్చిన ఘట్టంగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను ప్రతిఫలించే దేశంగా అమెరికా నిలిచిందన్నారు.
అమెరికా ఆవిష్కరణలకు మార్గదర్శిగా, ప్రపంచం నూతన ఆలోచనలకు కేంద్రబిందువుగా నిలుస్తోందని సీఎం అన్నారు. తెలంగాణ కూడా అదే దారిలో అభివృద్ధి చెందుతోంది. స్నేహపూర్వక దౌత్య సంబంధాలను బలోపేతం చేసుకుంటూ, పెట్టుబడులు, విజ్ఞానం, సాంకేతికతను ఆకర్షించాలన్న దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అమెరికా – తెలంగాణ బంధం మరింత బలపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
2008లో హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ స్థాపనతో ఆర్థిక, విద్య, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో సహకారం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ సందర్భంగా అమెరికా కాన్సూల్ జనరల్ శ్రీమతి జెన్నిఫర్ లార్సన్‌తో ముఖ్యమంత్రి ముచ్చటించారు. ప్రస్తుతం 200కి పైగా అమెరికన్ కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు.
అమెరికాలో చదువుకునే తెలుగు విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నదని, ఇది అభినందనీయమని పేర్కొన్నారు. విద్య, పరిశోధన, ఐటీ, ఆరోగ్య సేవల వంటి రంగాల్లో అమెరికా – తెలంగాణ సహకారం మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజల మధ్య స్నేహబంధాన్ని మరింతగా మధురంగా మార్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
తెలంగాణను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్’ దార్శనికతను ప్రకటించినట్లు తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం అమెరికా సహకారం కూడా కీలకం కావాలని పేర్కొన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ప్రజల శ్రేయస్సు సాధించేందుకు రెండూ కలిసి పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు.