
సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షన్ముగరత్నంతో భేటీ అవడం ఎంతో సంతోషంగా అనిపించింది. భారత్–సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనున్న సందర్భంలో ఈ సమావేశం జరిగింది. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సహకారం మరింత విస్తరించేందుకు ఇది ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.
ఈ భేటీలో ప్రధానంగా నాలెడ్జ్ ఎకానమీ, ఆధునిక మౌలిక సదుపాయాలు, సెమికండక్టర్లు, అమరావతి అభివృద్ధి, పట్టణ ప్రణాళిక మరియు పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించాము. ముఖ్యంగా అమరావతి నగర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు, పెట్టుబడులపై విశ్లేషణ జరిపాము. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మించాలన్న లక్ష్యంతో అమరావతిని రూపొందించేందుకు సింగపూర్ మద్దతు కీలకమని భావిస్తున్నాము.
సింగపూర్ నైపుణ్యం, ఆవిష్కరణలు, పర్యావరణ అనుకూల నగర ప్రణాళికలు తదితర అంశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మార్గదర్శకంగా నిలవగలదని విశ్వసిస్తున్నాను. ఈ అంశాలపై పరస్పర అవగాహన పెంపొందించుకోవడం, ప్రాజెక్టుల అమలు వేగవంతం చేయడం కోసం ఉమ్మడి వేదికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము.
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో సింగపూర్‌తో భాగస్వామ్యం రాష్ట్రానికి కొత్త అవకాశాలను తెరుస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ ఎనర్జీ వంటి రంగాల్లో సాంకేతిక మార్పిడి, పెట్టుబడులు అందుకునే అవకాశాలపై చర్చలు జరిపాము.
ఈ సమావేశం ద్వారానైనా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, భారతదేశం-సింగపూర్ మైత్రి సంబంధాల బలోపేతానికి పునాది వేయబడినందుకు మేము ఎంతో గర్వంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం మరింత బలపడుతుందని విశ్వసిస్తున్నాను.


