
సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ పర్యటన కొనసాగుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధిపై అధ్యయనం చేయడం కోసం ఆయన పలు కీలక సంస్థలతో సమావేశమవుతున్నారు. గురువారం నాడు సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమరావతిలో రోడ్డు రవాణా అభివృద్ధి, ప్రజా రవాణా సౌకర్యాలపై చర్చ జరిగింది.
సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఉపరితల రవాణా మౌలిక వసతులపై తన ప్రత్యేకమైన మోడల్‌ను అమలు చేస్తోంది. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, బస్సు మార్గాలు, మెట్రో లైన్ లాంటి అంశాల్లో ఆ సంస్థ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ తరహా మోడల్స్‌ను అమరావతిలో ఎలా వినియోగించొచ్చో అనే దానిపై చర్చ సాగింది. మంత్రి నారాయణ ఈ సందర్భంగా సింగపూర్ రవాణా వ్యవస్థను పక్కాగా అధ్యయనం చేశారు.
అలాగే, మంత్రి బృందం సింగపూర్‌లోని జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించింది. ఇది మొట్టమొదటి వన్-స్టాప్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ కేంద్రంగా పేరుగాంచింది. చికెన్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, డెలివరీ ప్రక్రియలను అధ్యయనం చేసి, ఆ తరహా యూనిట్లను ఏపీలో కూడా నెలకొల్పే యోచనలో ఉన్నారు. ఇది శాస్త్రీయంగా వ్యర్థాలను ప్రాసెస్ చేయడం ద్వారా పర్యావరణ హితంగా ఉంటుంది.
బ్రాండ్ ఏపీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఏపీ ప్రభుత్వం సింగపూర్ పర్యటనను చేపట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణతో పాటు ఉన్నతాధికారులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు.
ఈ నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికే తిరిగి వచ్చారు. అయితే మంత్రి నారాయణ ఇంకా సింగపూర్‌లో పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ పర్యటన ద్వారా అమరావతిలో అనేక అభివృద్ధి ప్రణాళికలు రూపుదిద్దుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.


