
ప్రొ కబడ్డీ లీగ్ (PKL) సీజన్ 12 ఈసారి విశాఖపట్నంలో ఓ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. విశాఖ నగరం ఏడేళ్ల తర్వాత మళ్లీ ఈ కబడ్డీ పండుగకు వేదిక కావడం క్రీడాభిమానులలో హర్షాతిరేకాలు రేపుతోంది. 2018లో చివరిసారిగా ఈ పోటీలు ఇక్కడ జరిగిన తర్వాత, ఈసారి సీజన్‌లో విశాఖ కీలక పాత్ర పోషించనుంది. ఈ సీజన్ మొత్తం నాలుగు ప్రధాన నగరాల్లో జరగనుండగా, విశాఖతో పాటు జైపూర్, చెన్నై, ఢిల్లీ నగరాలు కూడా ఈ లీగ్‌కు ఆతిథ్యమివ్వనున్నాయి.
ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడతాయి. లీగ్‌లో మొత్తం 108 మ్యాచ్‌లు నిర్వహించనుండగా, వాటిలో 28 మ్యాచ్‌లు విశాఖపట్నంలో నిర్వహించబోతున్నారు. ఇది విశాఖ క్రీడాభిమానులకు ఒక పెద్ద అవకాశం. టీమ్స్ మధ్య హోరాహోరీ పోటీలు, ఉత్సాహభరితమైన వాతావరణం ఆ నగరాన్ని కబడ్డీ పండుగగా మార్చనుంది. ఈ లీగ్ ద్వారా నగరానికి కొత్త ప్రాధాన్యం వస్తుందని, క్రీడా పర్యాటకాన్ని ప్రోత్సహించగలదని నిర్వాహకులు పేర్కొన్నారు.
ప్రతి జట్టులోనూ అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, యువ క్రీడాకారులు సమపాళ్లలో ఉంటారు. ప్రేక్షకులకు క్రీడా ఉత్సాహాన్ని అందించడంతో పాటు స్థానిక కబడ్డీ ఆటగాళ్లకు ప్రోత్సాహం కలిగించేలా ఈ టోర్నీ జరుగుతుంది. విశాఖలోని ఇండోర్ స్టేడియం ఇప్పటికే మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధంగా ఉంది. సాంకేతిక పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సీజన్ విజయవంతమైతే, రాబోయే సీజన్లలో కూడా విశాఖకు రెగ్యులర్‌గా PKL మ్యాచ్‌లను మళ్ళీ రావచ్చని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరహా లీగ్‌లు రాష్ట్ర యువతలో క్రీడా అభిరుచిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వారు అన్నారు.


