
తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణ రైజింగ్ 2047” పేరుతో విశాల దృష్టికోణంతో విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజన్‌లో హెల్త్ టూరిజాన్ని ఒక ముఖ్యమైన అధ్యాయంగా చేర్చనున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆరోగ్యరంగ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను స్పష్టంగా చూపిస్తోంది.
బంజారాహిల్స్‌లో ఉన్న ఏఐజీ ఆస్పత్రిని ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఆయన సేవల వల్ల తెలంగాణ, భారత్‌కు పేరు వచ్చిందిని కొనియాడారు. పద్మవిభూషణ్ అందుకున్న నాగేశ్వర్ రెడ్డి భారతరత్నకు కూడా అర్హుడని అభిప్రాయపడ్డారు. విదేశాల నుంచి కూడా రోగులు ఏఐజీ ఆసుపత్రికి వస్తుండటం గర్వించదగిన విషయమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా గోషామహల్‌లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఇప్పటికే శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈ కొత్త ఆసుపత్రులు పూర్తయితే రాష్ట్రంలో 7,000 పడకలు అదనంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా వైద్యం అందించేలా ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు.
వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్య రంగానికి రూ.21,500 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం ఉచితంగా అందించాలన్నదే లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ వైద్యులు ఏడాదిలో ఒక నెల ప్రభుత్వాసుపత్రుల్లో పని చేయాల్సిందిగా సూచించారు. ఇది సామాజిక బాధ్యతగా తీర్చాల్సిన ఋణమని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్, టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి హైదరాబాద్‌కు నేరుగా విమాన కనెక్టివిటీ పెంచేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన అడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


