
ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యార్థులకు కష్టాలు
తెలంగాణలో ఎండలు తీవ్రంగా పెరుగుతుండటంతో, ఒంటి పూట బడులను అమలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో 35 నుండి 37 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ సమస్య పెరిగే అవకాశం ఉండటంతో, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఒంటి పూట బడులు నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫిబ్రవరి నెల నుంచే ఎండలు మామూలుగా లేవు. పొద్దున 10 గంటలు దాటాక సూర్యుడు తన తీవ్రతను చూపించడం ప్రారంభిస్తాడు. మరో నెల రోజుల్లో వేసవి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రోడ్ల వెంట చిన్న వ్యాపారాలు చేసేవారు ఎండల ధాటికి అల్లాడిపోతున్నారు. మరి, స్కూల్కు వెళ్లే చిన్నారుల పరిస్థితి ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఉదయం వెళ్లేందుకు కష్టంగా మారుతోంది, స్కూల్లో ఉక్కపోత, తిరిగి ఇంటికి వచ్చే వేళలో ఎండ భరించలేని పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థి సంఘాలు ఒంటి పూట బడులను నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
పిల్లలను ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కు పంపడం తల్లిదండ్రులు కూడా ఇష్టపడటం లేదు. పిల్లల ఆరోగ్యం విషయంలో ఎవరూ రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు. వడదెబ్బ, నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థులు అలసిపోయి నీరసంగా ఉండడం గమనించామంటున్నారు. ఈ నేపథ్యంలో ఒంటి పూట బడులు నిర్వహించడం సమయోచితమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వం ఒంటి పూట బడులపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే సంబంధిత ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని, ఈ నిర్ణయం త్వరలో అధికారికంగా ప్రకటించబడుతుందని సమాచారం. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఒంటి పూట బడుల అమలు ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు భావిస్తున్నారు.దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
ఒంటి పూట బడుల ప్రారంభ తేదీపై స్పష్టత విద్యార్థి సంఘాల సూచన ప్రకారం, మార్చి 1 నుండి ఒంటి పూట బడులు అమలు చేస్తే మంచిదని భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం మార్చి మొదటి వారం తర్వాత అంటే, మార్చి 10వ తేదీ నుంచి అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే కొన్ని రోజులలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.