
లండన్ నగరానికి వ్యక్తిగత పర్యటన నిమిత్తం చేరుకున్నప్పుడు, అక్కడి తెలుగు కుటుంబాలు చూపిన ఆత్మీయత మనసును హత్తుకుంది. విదేశీ నేలపై కూడా మన సంస్కృతి, మన బంధం ఎంత బలంగా ఉందో అది మరోసారి స్పష్టమైంది. తెలుగు భాష, సంప్రదాయాల పట్ల ఆ కుటుంబాల గౌరవం చూసి గర్వంగా అనిపించింది. ఈ ఆతిథ్యం మన సమాజం ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది.
ఈ సందర్బంగా నా సతీమణి శ్రీమతి భువనేశ్వరి గారిని గౌరవించడం నాకు మరింత ఆనందాన్ని కలిగించింది. ఆమెకు ఈ నెల 4వ తేదీన ప్రతిష్ఠాత్మక సంస్థ అయిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) నుండి రెండు ముఖ్యమైన అవార్డులు లభించబోతున్నాయి. ఇది ఆమె వ్యక్తిగత కృషి, దూరదృష్టి, మరియు సమాజ పట్ల ఉన్న నిబద్ధతకు ప్రతిఫలంగా చెప్పవచ్చు.
ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో భువనేశ్వరి గారు చేసిన ప్రజాసేవా కార్యక్రమాలు ఎన్నో జీవితాలను ప్రభావితం చేశాయి. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి రంగాల్లో ట్రస్ట్ చేసిన సేవలు సమాజంలో సానుకూల మార్పు తీసుకువచ్చాయి. ఈ కృషికి గుర్తింపుగా ఆమెకు “డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025” అవార్డు ఇవ్వడం గర్వకారణం.
అలాగే, హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలో వీసీఎండీగా భువనేశ్వరి గారి నాయకత్వం కూడా ఆదర్శప్రాయమైనది. సంస్థలో ఉన్నతమైన కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలు, నిబద్ధత, పారదర్శకతకు గుర్తింపుగా ఆమెకు “గోల్డెన్ పీకాక్ అవార్డు” లభిస్తోంది. ఈ అవార్డు కేవలం వ్యక్తిగత విజయమే కాదు, సంస్థ విలువలకు లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా చెప్పవచ్చు.
ఈ రెండు అవార్డులు తెలుగు మహిళా ప్రతిభకు అంతర్జాతీయ వేదికపై లభించిన గౌరవ సూచకాలు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో గర్వకారణం. భువనేశ్వరి గారు సాధించిన ఈ విజయాలు ప్రతి భారతీయునికీ, ముఖ్యంగా ప్రతి తెలుగు మహిళకీ స్ఫూర్తిగా నిలుస్తాయి.


