
టీమిండియా క్రికెట్ ప్రేమికులకు పెద్ద షాక్‌గా ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ నిలిచాయి. ఇప్పటివరకు వన్డే ఫార్మాట్లో అద్భుత ప్రదర్శనలతో అగ్రస్థానాల్లో ఉన్న టీమిండియా దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మలు తాజాగా టాప్-10 జాబితాలో లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. వారం క్రితం విడుదలైన ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ రెండో స్థానంలో, కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నప్పటికీ, కొత్త జాబితాలో వీరి పేర్లు పూర్తిగా మాయమయ్యాయి.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి స్థానాన్ని భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (784 పాయింట్లు) కాపాడుకున్నాడు. గత వారం రోహిత్ శర్మ 756 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, తాజాగా అతని స్థానాన్ని పాక్ బ్యాటర్ బాబర్ ఆజామ్ ఆక్రమించాడు. బాబర్ ఆజామ్ 759 పాయింట్లతో రెండో స్థానంలోకి ఎగబాకగా, దక్షిణాఫ్రికా ఆటగాడు వాన్ డెర్ డుస్సెన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
విరాట్ కోహ్లీ గత వారం నాలుగో స్థానంలో ఉండగా, ఈసారి ర్యాంకింగ్స్‌లో అతని పేరు కూడా గల్లంతవ్వడం విశేషం. తాజాగా కోహ్లీ స్థానాన్ని పాక్ ఆటగాడు ఇమామ్-ఉల్-హక్ దక్కించుకున్నాడు. ఈ పరిణామాలు టీమిండియా అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు టెస్ట్, టీ20 ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇప్పుడు ఫామ్‌లో లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే నిపుణులు మాత్రం రాబోయే సిరీస్‌లలో ఈ దిగ్గజ బ్యాటర్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చి ర్యాంకింగ్స్‌ను సాధించడం ఖాయమని నమ్ముతున్నారు.
భారత క్రికెట్ అభిమానులు ఇప్పుడు రోహిత్-కోహ్లీలు తమ ప్రదర్శనను మెరుగుపరచి మళ్లీ టాప్ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాలని ఆశిస్తున్నారు. రాబోయే సిరీస్‌లు వీరిద్దరికీ తిరిగి రాణించే పెద్ద అవకాశం కానున్నాయి.


