
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలకు కూటమి ప్రభుత్వం మరొక శుభవార్తను అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తాజా సమాచారం మేరకు, “అన్నదాత సుఖీభవ” పథకానికి సంబంధించిన నిధులను ఈ నెల 30వ తేదీలోపు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ పథకంతో రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఆర్థికంగా ఊరట కలిగే అవకాశం ఉంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న నేపథ్యంలో, పాలనలో తమ ప్రత్యేకతను చూపిస్తూ అభివృద్ధికి తోడ్పడే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన “సూపర్ సిక్స్” పథకాలలో భాగంగా “అన్నదాత సుఖీభవ” అమలులోకి రావడం రైతులకు పెద్ద ఊరటగా మారింది. ఈ పథకం కింద 47.77 లక్షల మంది అర్హులైన రైతు కుటుంబాలకు నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు ప్రకారం, ఈ పథకం కింద అర్హులైన రైతులను గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు 98 శాతం మంది రైతులు ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయగా, మిగతా రైతులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సొంత భూములు ఉన్న రైతులతో పాటు, ఎసైన్డ్ భూములు మరియు ఈనాం భూములపై సాగు చేసే రైతులు కూడా ఈ పథకానికి అర్హులని తెలిపారు.
అంతేకాకుండా, భూమిలేని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. వారు “ఈ-పంట”లో నమోదు చేయించుకొని, గుర్తింపు కార్డు పొందడం ద్వారా ఈ పథకంలోని ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. కౌలు రైతులకు 2026 అక్టోబర్, జనవరిలో రెండు విడతలుగా నిధులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేసిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే నిధులు జమ చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఆర్థిక శాఖకు అవసరమైన సూచనలు ఇవ్వడంతో, ఈ నెల 30 నాటికి నిధుల విడుదల జరగబోతుందని సమాచారం. ఈ పథకం అమలుతో రైతులకు మద్దతుగా ప్రభుత్వం నిలిచిందని ప్రజలు భావిస్తున్నారు.