
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కోటి 40 లక్షల 96 వేల 86 రేషన్ కార్డులు ఉన్నాయని, వాటిని డిజిటలైజ్ చేసి కొత్తగా ముద్రిస్తున్నామని తెలిపారు.
నూతన రేషన్ కార్డులపై కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే ఉండేలా డిజైన్ చేయబడింది. డెబిట్, క్రెడిట్ కార్డు ఆకారంలో ఉండే ఈ స్మార్ట్ కార్డులు ఉచితంగా అందించనున్నట్లు మంత్రి తెలిపారు. కార్డులో క్యూఆర్ కోడ్ ద్వారా లావాదేవీలు జరుగుతాయని, ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే కేంద్ర స్థాయి అధికారులకు సమాచారం చేరుతుందని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొని పంపిణీ ప్రారంభించనున్నారు.
రేషన్ పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 29,786 షాపులను అందుబాటులో ఉంచారని, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ప్రతి నెల 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య హోమ్ డెలివరీ ద్వారా సరకులు అందించనున్నట్టు వెల్లడించారు.
దీపం పథకంలో కూడా ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకూ 93 లక్షల మందికి డెలివరీలు పూర్తయ్యాయని, డిజిటల్ వ్యాలెట్ ద్వారా నేరుగా ఖాతాలో నగదు జమ చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. 4,281 మంది లబ్ధిదారులకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా డిజిటల్ వ్యాలెట్లు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే 86 వేల మందికి అకౌంట్ సమస్యల కారణంగా డబ్బులు పడలేదని, వీరి సమస్యలు త్వరలో పరిష్కరించనున్నట్లు చెప్పారు.
రేషన్ కార్డు ఆధారంగా అన్ని సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం పొందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు 3 లక్షల 56 వేల మంది మృతుల రికార్డులను తొలగించామని తెలిపారు. పలు సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. మొత్తంగా కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు.


