
రూపాయి 500 నకిలీ నోట్ల విషయంలో కేంద్ర హోంశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యాధునిక టెక్నాలజీ ద్వారా తయారైన ఈ నకిలీ నోట్లు మార్కెట్‌లో చలామణి అవుతున్నాయని హెచ్చరిక జారీ చేసింది. దొంగనోట్ల ప్రింటింగ్ నాణ్యత అసలైన నోట్ల మాదిరిగా ఉండడంతో ప్రజలు తేడా గుర్తించలేకపోతున్నారు. దీనికి సంబంధించి డీఆర్ఐ, ఎఫ్ఐయూ, సీబీఐ, ఎన్ఐఏ, సెబీ వంటి కీలక కేంద్ర సంస్థలకు సమాచారాన్ని పంపినట్లు హోంశాఖ వెల్లడించింది.
ఈ నకిలీ నోట్ల గుర్తింపులో కీలకమైన అంశాన్ని హోంశాఖ వెల్లడించింది. “RESERVE BANK OF INDIA” అన్న పదాల్లో “RESERVE” అనే పదంలో “E” స్థానంలో “A” ప్రింట్ అయ్యిందని తెలిపింది. మామూలుగా చూస్తే ఈ తప్పు కనిపించదు కానీ, నోటును క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మాత్రమే ఇది కనిపించవచ్చని పేర్కొంది. ఈ పొరపాటును గుర్తించడం వల్లే నకిలీ నోట్లను గుర్తించగలమని చెప్పింది.
ఇలాంటి నకిలీ నోట్లు దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ముప్పు అని హోంశాఖ అభిప్రాయపడింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రిటైల్ వ్యాపారులు ఇలా నోట్లతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటి నోట్లు వెలుగులోకి వచ్చాయని అధికారులు పేర్కొన్నారు.
నకిలీ నోట్లు పెద్ద సంఖ్యలో మార్కెట్లో ఉన్న అవకాశం ఉందని, అయితే అవి ఎక్కడెక్కడున్నాయన్నదాన్ని స్పష్టంగా గుర్తించలేకపోతున్నామని తెలిపింది. ఉగ్రవాద ఫైనాన్స్ కోణంలోనూ దీనిపై దర్యాప్తు జరుగుతోందని సమాచారం. ప్రజలు ఏదైనా అనుమానాస్పద నోటు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
మొత్తానికి ప్రజలు, సంస్థలు ఈ రకమైన నకిలీ నోట్ల నుంచి తప్పించుకోవాలంటే ప్రతి నోటును జాగ్రత్తగా పరిశీలించడం, అవగాహన కలిగి ఉండటం అత్యవసరం. కేంద్ర హోంశాఖ ఈ విషయమై జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తోంది.