
నిరుపేదలకు విద్య అందుబాటులోకి వచ్చినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథాన నడుస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ వాటిని అందిపుచ్చుకున్నప్పుడే సరైన ఫలితాలు వస్తాయని చెప్పారు.
నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, హాస్టల్ భవనాలు, నర్సింగ్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ముఖ్యమంత్రి గారు విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించిన చిట్టెం నర్సిరెడ్డి గారి పేరును ఈ మెడికల్ కాలేజీకి పెట్టడం సముచితంగా ఉంటుందని అన్నారు.
“పేదలకు విద్య అందుబాటులోకి తీసుకురావడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి తీసుకురావు. నిజమైన పేదవాడికి సంక్షేమం అందినప్పుడు, ముఖ్యంగా విద్య వారికి చేరినప్పుడే అభివృద్ధి చెందుతుంది. రంగుల గోడలు, అద్దాల మేడలు ప్రభుత్వం నిర్మించగలదు. కానీ విద్యలో రాణించాలంటే వాటిని సరైన విధంగా ఉపయోగించుకున్నప్పుడే దాని ఫలితాలు అందుతాయి.
గతంలో కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా ప్రయత్నించి రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. డాక్టర్ వృత్తి ఒక ఉద్యోగం కాదు. ఒక బాధ్యత. మీరంతా గొప్ప డాక్టర్లుగా రాణిస్తే రాష్ట్రానికి మంచి సేవలు అందించగలరు..” అని అన్నారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాలతో పాటు ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి గారు జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, లోక్ సభ సభ్యురాలు డీకే అరుణ గారితో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు