
రాష్ట్రవ్యాప్తంగా మొంథా తుఫాన్ ప్రభావం కొనసాగుతుండగా, ప్రభుత్వం పరిస్థితిని గంట గంటకు పరిశీలిస్తూ అవసరమైన చర్యలను చేపడుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, ప్రతి జిల్లాలోని పరిస్థితులపై నివేదికలు తీసుకుంటున్నారు. తుఫాన్ వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నిరంతరంగా నిజమైన సమాచారం అందిస్తూ, వారు అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
సముద్ర తీర ప్రాంతాలు అత్యంత ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున, అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఇప్పటికే పునరావాస చర్యలు ప్రారంభమయ్యాయి. రహదారులు, విద్యుత్ లైన్లు, నీటి పారుదల వ్యవస్థలు ప్రభావితమవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విరిగిన చెట్లు, బోర్డులు, లైట్లు వంటి వాటిని తొలగించేందుకు మున్సిపల్ మరియు గ్రామీణ బృందాలు పనిచేస్తున్నాయి.
తుఫాన్ కారణంగా ఏర్పడే అత్యవసర పరిస్థితులకు ఎన్డీఆర్ఎఫ్ మరియు ఎస్డీఆర్ బలగాలను మోహరించారు. వీరు తీరప్రాంత గ్రామాలు, పట్టణాల్లో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. వర్షాలు, గాలివానలు పెరిగిన ప్రాంతాల్లో వైద్య బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే తక్షణ చికిత్స, ఆహారం, తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు సీఎం తో ఫోన్ ద్వారా మాట్లాడి రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని సహాయాలు అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రతీర ప్రాంతాలకు వెళ్లకూడదని, ప్రభుత్వం జారీ చేసిన హెచ్చరికలు తప్పక పాటించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ఇంటి బయటకు రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అధికారులను సంప్రదించాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రభుత్వానికి ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.


