
రజనీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్లో మరోసారి ఓ భారీ సినిమా రాబోతున్న వార్త సినీప్రియుల్లో విశేష ఉత్సాహం రేపుతోంది. ఈ ఇద్దరూ కలసి చివరిసారి నటించిన సినిమా 1979లో వచ్చిన అల్లావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్ కావడం విశేషం. అప్పటి నుంచి వీరిద్దరూ ఒకే తెరపై కనిపించకపోవడంతో, ఇప్పుడు ఈ కాంబో మళ్లీ రీ-యూనియన్ అవుతుందన్న వార్త అభిమానుల్లో పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
ప్రారంభంలో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఆ తరువాత ప్రదీప్ రంగనాథన్ పేరు కూడా చర్చలోకి వచ్చింది. కానీ ప్రదీప్ తానే డైరెక్ట్ చేయడం లేదని స్పష్టం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు నిలిచిపోయిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయినా అభిమానుల ఆశలు చల్లారలేదు. వారు ఈ కాంబినేషన్లో సినిమా తప్పకుండా వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
తాజాగా రజనీకాంత్ కూతురు సౌందర్య రజనీకాంత్ మరియు కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ చెన్నైలో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఈ వార్తను ధృవీకరించారు. ఈ ఇద్దరూ మాట్లాడుతూ, “రజనీ-కమల్ కాంబో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్‌పై తెరకెక్కుతుంది” అని వెల్లడించారు. తమ తండ్రులు కలసి నటించడాన్ని తామూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.
కమల్ హాసన్ కూడా గతంలో సైమా అవార్డుల సందర్భంగా ఈ విషయంపై స్పందిస్తూ, “మేమిద్దరం కలసి పనిచేయాలని చాలా ఏళ్లుగా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆ సమయం దగ్గరపడింది. ప్రేక్షకులు సంతోషిస్తే మాకంటే ఆనందం ఇంకేముంది?” అని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ మల్టీస్టారర్ సినిమాకు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్‌తో చేస్తున్న జైలర్ 2 పూర్తైన వెంటనే ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. అభిమానులు ఈ లెజెండరీ కాంబినేషన్‌ను మళ్లీ పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


