
రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జరిగిన కారు ప్రమాదంలో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త సింగయ్య మృతిచెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తనకు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో లోపాలున్నాయని మళ్లీ స్పష్టం చేశారు. భద్రత అంశంపై సీఎం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ట్విటర్‌లో ప్రశ్నలు సంధించారు.
జగన్ ట్వీట్‌లో పేర్కొన్నది: “ఒక మాజీ ముఖ్యమంత్రిగా జడ్ ప్లస్ భద్రత నాకు హక్కు. మూడేళ్లు ఈ భద్రతపై ఎటువంటి సమస్యలూ లేవు. ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఇది ఇచ్చేది, తీసేదీ అన్న అధికారం ఉందా?” అని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమానికి రూట్‌మ్యాప్ ఇచ్చిన తర్వాత, రోప్ పార్టీలు, పైలట్ వెహికల్స్ ఉంటే ప్రమాదం జరిగేది కాదని పేర్కొన్నారు.
ఇక వైసీపీ నేతలు కూడా భద్రతా లోపాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, జగన్‌కు ప్రభుత్వ భద్రతా విధానంలో విఫలం స్పష్టంగా కనిపిస్తోందని, సింగయ్య ఘటనపై బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. భద్రతా బాధ్యత సరిగా నిర్వర్తించకపోవడం వల్లే ఈ విషాదకర ఘటన జరిగిందని విమర్శించారు.
ఇదే అంశంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. జగన్‌కు సాధారణ జడ్ ప్లస్ కంటే అధిక భద్రత కల్పించామని తెలిపారు. కానీ వైసీపీ నేతలే భద్రతా నియమాలను ఉల్లంఘించారని విమర్శించారు. పోలీసుల సూచనలు పాటించకపోవడమే సమస్యకు కారణమని చెప్పారు.
మొత్తానికి జగన్ తన భద్రతపై మళ్లీ జడ్ ప్లస్ విషయాన్ని తెరపైకి తీసుకురావడం, టీడీపీ నుంచి వచ్చిన గట్టిపలుకులతో ఈ అంశం రాజకీయంగా మరింత హీటైంది.