
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు విడుదలకు సిద్ధమవుతోంది. ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్ జూలై 24న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎ. దయాకర్ రావు నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి దర్శకులుగా క్రిష్ జాగర్లమూడి తొలుత పని చేయగా, తర్వాత జ్యోతి కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందాయి. త్వరలో ట్రైలర్ కూడా విడుదల కానుంది.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో కీలకమైన ఔరంగజేబ్ పాత్రలో నటిస్తున్న బాబీ డియోల్ గురించి డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మొదట బాబీ పాత్రకు కొన్ని సన్నివేశాలను సాదాసీదాగా రూపొందించారట. కానీ ‘యానిమల్’ చిత్రంలో ఆయన నటన చూసిన తర్వాత, ఆ పాత్రకు సముచిత న్యాయం చేయాలనిపించి, పూర్తి స్థాయిలో రీడిజైన్ చేసినట్టు తెలిపారు.
జ్యోతికృష్ణ ప్రకారం, బాబీ డియోల్ పాత్రను కొత్త కోణంలో మలచినప్పుడు, ఆయన ఎంతో ఉత్సాహంగా స్పందించారట. సైలెంట్ క్యారెక్టర్ అయినా కూడా, కళ్ల చూపు, ముఖ హావభావాల ద్వారా తన నటనలో జీవం పోసిన బాబీ డియోల్ ఈ పాత్రలోనూ అదే స్థాయిలో మెప్పిస్తారని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే బాబీకి ‘యానిమల్’ తరువాత వచ్చిన ఫేమ్‌ను బట్టీ ఈ పాత్ర మరింత బలంగా ఉండాలని చిత్ర యూనిట్ భావించిందట. అందుకే ఔరంగజేబ్ పాత్రకు కొత్త నేపథ్యాన్ని, కాస్ట్యూమ్స్‌ను, డైలాగ్స్‌ను జోడించారని సమాచారం.
ఈ చిత్రం ద్వారా పవన్ కళ్యాణ్ నటనతో పాటు బాబీ డియోల్ పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోందన్నది ఖాయం. ఈ కొత్త కోణంలో రూపొందిన ఔరంగజేబ్ ఎలా ఉంటాడో అన్నది తెరపై చూడాల్సిందే.


