
మూవీ: మోక్ష పటం
నటీనటులు: తిరువీర్, శాంతి రావ్, పూజ కిరణ్, గురు చరణ్, తరుణ్, జెన్నిఫర్, తదితరులు
సంగీతం: కమ్రాన్
సినిమాటోగ్రఫీ: గోకుల్ భారతి, సిద్ధం మనోహర్
ఎడిటింగ్: సృజన
నిర్మాత: నేస్తమా మూవీ మేకర్స్, ద్రవిడ చిత్ర
దర్శకత్వం: రాహుల్ వనజ రాజేశ్వర్
చిన్న సినిమాలుగా OTT లో విడుదలయ్యి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న చిత్రాలు ఇటీవలి కాలంలో తెలుగులో పెరుగుతున్నాయి. అలాంటి కోవలోకి చెందిన ఈ మోక్షపటం ఎలా ఉందో చూసేద్దాం.
ఒక Hotel లో ఫ్లోర్ మేనేజర్ గా పని చేస్తున్న గాయత్రి (శాంతి రావ్) కి అనుకోకుండా డబ్బు కట్టలు ఉన్న ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ ఆనందం తనకు ఎంతకాలం నిలబడింది?
పాస్పోర్ట్ ఆఫీసు లో పని చేసే అర్జున్ (తిరువీర్) కి ఒక మిత్రుడు ఫోన్ చేసి దొంగ పాస్పోర్ట్ కావాలి అని అడుగుతాడు. అప్పటికే తన మామ దగ్గర అప్పు చేసి తీర్చలేక తంటాలు పడుతున్న అర్జున్ జీవితంలో ఆ ఫోన్ కాల్ వల్ల వచ్చిన మార్పులు ఏంటి?
శాడిస్ట్ భర్తను భరిస్తున్న శాన్వి (జెన్నిఫర్) అతను పని మీద ఢిల్లీ వెళ్ళిన మూడు రోజులు, ఫ్రెండ్ ప్రోత్సాహంతో ఒక అఫ్ఫైర్ పెట్టుకుంటుంది, ఆ తరువాత ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగింది?
అసలు ఈ మూడు కథలకు సంబంధం ఏంటి? మూడు కథలు ఎప్పుడు ఎక్కడ కలుస్తాయి? అనేది తెర పైనే చూడాలి.
ఆడియన్స్ ఏ మాత్రం ఊహించని ట్విస్ట్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ, దానికి అనుగుణంగా రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా బాగుంది. అవసరానికి మించిన సన్నివేశం ఒక్కటి కూడా కనిపించకపోయినా ఎందుకో అక్కడక్కడా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రధామార్ధం మొదలయిన 10 నిమిషాల వరకు కాస్త గందరగోళంగా ఉన్నా ఒక్కసారి కథ ఊపు అందుకున్న తరువాత ప్రతి సీన్ ని గ్రిప్పింగ్ గా రూపొందించాడు దర్శకుడు. మూడు విభిన్నమైన కథలు ఉన్నా ఎక్కడా ప్రేక్షకుడు కన్ఫ్యూస్ అవ్వకుండా తెరకెక్కించిన తీరు మెచ్చుకొని తీరాలి.
నటీనటులు:
మసూద, పారేషన్ వంటి చిత్రాలలో తన నటన తో ఆకట్టుకున్న తిరువీర్ ఇందులో కూడా పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్రలో తన ప్రతిభ ని పూర్తిగా చూపించాడు. మంచి అవకాశం వస్తే ఎంత ఇంపాక్ట్ చూపించగలడో ఈ చిత్రంతో మరోమారు నిరూపించాడు.
ఎన్నో ఆశలు ఉన్నా వాటిని fulfil చేసుకునే ఆర్ధక స్థోమత లేని మధ్య తరగతి మహిళ పాత్రలో శాంతి రావ్ రాణించింది.
ఒక మంచి స్నేహితురాలిలా, ఒక సెల్ఫీష్ ప్రేమికురాలిలా, డబ్బు కోసం ఎంత దూరం అయినా వెళ్ళే మాయలేడి లా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో పూజ కిరణ్ జీవించింది అనే చెప్పాలి.
టెక్నికల్ గా సినిమాటోగ్రాఫి బాగుంది. పేరుకు చిన్న సినిమా అయినా కానీ ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కడా చిన్న సినిమా చూస్తున్న భావన కలగదు. కమ్రాన్ నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు.
ఓవరాల్ గా చూస్తే, రొటీన్ చిత్రాలలా కాకుండా కాస్త కొత్త అనుభూతిని పంచే చిత్రమిది అనిపిస్తుంది. డబ్బు విషయంలో మనుషులలో ఉండే భయాలను, అత్యాశలను దర్శకుడు చక్కగా తెరపై ఆవిష్కరించాడు. ఇదే కథ ని క్రైమ్ డ్రామా లా కాకుండా క్రైమ్ థ్రిల్లర్ లా తీసి ఉంటే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది.