
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న బయోపిక్కు సంబంధించిన తాజా అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మా వందే’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని వీర్ రెడ్డి ఎం. నిర్మిస్తున్నారు. దేశ రాజకీయ చరిత్రలో కీలకమైన మోదీ ప్రయాణాన్ని వెండితెరపై నిజాయితీగా చూపించాలనే లక్ష్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రను మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తున్నారు. తెలుగులో ‘జనతా గ్యారేజ్’లో ఎన్టీఆర్ తమ్ముడిగా, ‘భాగమతి’లో అనుష్క ప్రేమికుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఉన్ని ముకుందన్, ఇప్పుడు మోదీ పాత్రలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. దర్శకుడు క్రాంతికుమార్ సిహెచ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం పూజా కార్యక్రమాలతో సినిమా లాంఛనంగా ప్రారంభమై, రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్లు మేకర్స్ వెల్లడించారు.
‘మా వందే’ సినిమా మోదీ వ్యక్తిగత జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు జరిగిన కీలక ఘట్టాలను సహజంగా చూపించబోతోంది. ముఖ్యంగా తల్లి సంకల్పం, విలువలు, కష్టాలు ఒక నాయకుడి రూపకల్పనలో ఎంత కీలకమో ఈ కథలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. యదార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది.
సాంకేతికంగా ఈ సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని ప్రముఖ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్‌కు పని చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్, హై ప్రొడక్షన్ విలువలతో ‘మా వందే’ను రూపొందిస్తున్నామని నిర్మాత వీర్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తుండగా, రవీనా టాండన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాబు శిరిల్, ఎడిటర్‌గా శేఖర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీని కె.కె. సెంథిల్ కుమార్ నిర్వహిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌లను కింగ్ సోలోమన్ రూపొందిస్తున్నారు. మోదీ జీవితాన్ని ప్రభావవంతంగా చూపించబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరుస్తోంది.


