
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించగా, తాజాగా మరో కీలక పథకానికి రూపకల్పన చేస్తున్నారు. “సూపర్ సిక్స్” హామీల్లో భాగంగా తాజాగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఇది అమలులో ఉంది.
2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం, మొదట పెన్షన్ పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను ప్రారంభించింది. ఇటీవలే తల్లికి వందనం పేరిట ప్రతి తల్లికి రూ. 13,000 చొప్పున జమ చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మహిళల ప్రయాణ ఖర్చును భరించే ఉద్దేశంతో ఉచిత బస్సు పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇది సూపర్ సిక్స్ హామీల్లో మరో కీలక అంశం.
ఈ పథకాన్ని వచ్చే ఆగస్టు 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలోని 2.62 కోట్ల మహిళల్లో చాలామంది రాకపోకలకు RTC సేవలను వినియోగించుకునే అవకాశముంది. ఏడాదిలో 88 కోట్ల ప్రయాణాలు జరిగే అవకాశం ఉందని అంచనా. ఉచిత బస్సు పథకం అమలుకు అదనంగా 2,536 బస్సుల అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేయడం లేదా అద్దెకు తీసుకునే ఆలోచన చేస్తోంది.
దీనితో పాటు ప్రభుత్వంపై భారం తగ్గించేందుకు డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చే ప్రక్రియ ప్రారంభం కానుంది. బ్యాటరీ స్వాపింగ్, సొంతంగా విద్యుత్ ఉత్పత్తి వంటి అవకాశాలను RTC పరిశీలిస్తోంది. ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యంగా ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకం అమలుతో మహిళల రాకపోకలు సులభతరమవడం తథ్యం. వారానికొకసారి అయినా ప్రతి మహిళ ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం లభిస్తుంది. అయితే, ఈ పథకానికి సంవత్సరానికి దాదాపు రూ. 996 కోట్లు ఖర్చవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయినా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు తహతహలాడుతోంది.


