
మదరాశి ట్రైలర్‌తో కోలీవుడ్ అభిమానులు మళ్ళీ ఉత్సాహంతో మునిగిపోయారు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న శివ కార్తికేయన్, ఈ సారి యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కనిపించబోతున్నాడు. అమరన్ వంటి విజయవంతమైన చిత్రానికి తరువాత వస్తున్న మదరాశి సినిమా పైన అంచనాలు అమాంతం పెరిగాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తుండటమే కాకుండా, శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మాణం అందిస్తున్న ఈ చిత్రం మొదటి నుంచే హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా, బాలీవుడ్ హీరో విద్యుత్ విలన్‌గా నటించడం మరింత ఆసక్తిని పెంచింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా వచ్చిన ట్రైలర్ మాత్రం సినిమా మీద మరింత బజ్‌ను తెచ్చిపెట్టింది. ‘ఇతరులను నీలా ప్రేమించు.. అందరూ నీ కుటుంబమే అనుకో’ అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవ్వడం విశేషం.
శివ కార్తికేయన్ ఈ సినిమాలో రఘు అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. సాధారణంగా హ్యాపీగా సాగుతున్న అతని జీవితం ఒక బాంబ్ బ్లాస్ట్ తరువాత తారుమారవుతుంది. ఆ బ్లాస్ట్ వెనుక ఉన్న నిజం, విలన్ విద్యుత్‌తో ఉన్న సంబంధం, తన ఊరును వదిలి వెళ్లమని ఎవరు బెదిరించారన్న అంశాలపై కథ మలుపులు తిరుగుతుంది. ఈ సస్పెన్స్ ఫాక్టర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచుతోంది.
ఏఆర్ మురుగదాస్ ప్రత్యేక శైలిలో కట్ చేసిన ట్రైలర్ దృశ్యపరంగా కూడా బలంగా ఉంది. యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని ఇప్పటికే కామెంట్స్ వినిపిస్తున్నాయి. శివ కార్తికేయన్, రుక్మిణి జంట కెమిస్ట్రీ తాజాగా కనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇచ్చిన బీజీఎమ్ ట్రైలర్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. మొత్తంగా, ట్రైలర్ చూసినవారు సినిమా హిట్ అనిపించేలా స్పందిస్తున్నారు.
మదరాశి సినిమా ఏఆర్ మురుగదాస్‌కు కీలకం కానుంది. గత కొన్నేళ్లుగా ఆయనకు ఆశించిన విజయం రాకపోవడంతో, ఈ సినిమాపైనే అన్ని ఆశలు పెట్టుకున్నాడు. శివ కార్తికేయన్ కెరీర్‌లో కూడా ఇది ఒక మైలురాయిగా నిలిచే అవకాశముంది. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.


