
మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ఇటీవల హిట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ, కొత్త ప్రయోగాలు చేస్తున్నా, విజయాలు మాత్రం వరించడం లేదు. దీంతో తన కెరీర్‌లో మలుపుతిప్పేలా ఒక స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన నూతన చిత్రం ‘భద్రకాళి‘ మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన అప్‌డేట్స్ సినిమా చుట్టూ పెద్ద హైప్ క్రియేట్ చేశాయి.
విజయ్ ఆంటోని ఇప్పటివరకు తనదైన శైలిలో వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ ఇటీవలి సినిమాలు ఆశించిన స్థాయిలో నిలవకపోవడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిస్థితిని మార్చేందుకు, ‘భద్రకాళి’ సినిమాను కెరీర్‌లో మైలురాయిగా నిలిపేలా ప్లాన్ చేశాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ, రూ.190 కోట్ల భారీ కుంభకోణం చుట్టూ తిరుగుతుంది. ఇందులో విజయ్ స్టైలిష్ యాక్షన్ అవతారంలో కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తుండగా, తెలుగులో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ రిలీజ్ చేస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ ఈ ప్రాజెక్ట్‌ను సమర్పిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు, ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి పాజిటివ్ వైబ్ తీసుకొచ్చాయి. తాజాగా రిలీజ్ చేసిన లవ్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్‌ను రాబట్టింది.
“మారెనా… ఏదో మారెనా“ అనే ఈ ఫీల్‌గుడ్ లవ్ సాంగ్ సంగీత ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది. విజయ్ ఆంటోని స్వయంగా కంపోజ్ చేసిన ఈ మెలోడీకి, భాష శ్రీ సాహిత్యం అందించగా, అభిజీత్ అనిల్ కుమార్ ఆలపించారు. హీరోయిన్ తృప్తి రవీంద్రతో విజయ్ కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలుస్తోంది.
సెప్టెంబర్ 19న గ్రాండ్ రిలీజ్ కానున్న ‘భద్రకాళి‘ విజయ్ ఆంటోని కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే ఆసక్తి పెరుగుతోంది. ఈసారి మాత్రం ఆయన హిట్ ట్రాక్‌పై పయనిస్తాడని అభిమానులు నమ్ముతున్నారు.


