
ఒకప్పటి స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌కు వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. ఈ నేపధ్యంలో తన ఇమేజ్‌ను మార్చుకోవాలన్న ఆలోచనతో నెగటివ్ పాత్రల వైపు మొగ్గు చూపాడు. ‘తానాజీ’, ‘ఆదిపురుష్’, ‘దేవర’ వంటి చిత్రాల్లో యాంటీ హీరోగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అయితే ఈ తరహా పాత్రలు కొనసాగితే తనపై ఒక స్థిరమైన అభిప్రాయం ఏర్పడుతుందన్న భయంతో మళ్లీ హీరో పాత్రలపై దృష్టిసారించాడు.
ఇప్పడు సైఫ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ కూడా అదే దారిలో ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అతను ఖుషీ కపూర్‌తో కలిసి నటించిన ‘నాదానియా’ అనే చిత్రం ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా విమర్శకులను, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇబ్రహీం నటనపై భిన్న స్పందనలు వచ్చినా, అతనిలో ఒక కొత్త ప్రయత్నం కనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇబ్రహీం ప్రస్తుతం ఆశలు పెట్టుకున్న ప్రాజెక్ట్ ‘సర్‌జమీన్’. ఈ చిత్రం ప్రారంభంలో థియేటర్లకు ప్లాన్ చేసినప్పటికీ, ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో జూలై 25న రిలీజ్ అవుతోంది. ఇందులో అతను హీరోగా కాకుండా విలన్‌గా నటిస్తున్నాడు. కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇబ్రహీం మరోసారి తన అభినయాన్ని నిరూపించుకునే అవకాశం పొందనున్నాడు.
రీసెంట్‌గా వచ్చిన టీజర్‌లో ఇబ్రహీం ఓ టెర్రరిస్ట్ పాత్రలో కన్పించి అందరికీ షాక్ ఇచ్చాడు. కెరీర్ ప్రారంభంలోనే ఈ తరహా పాత్రలతో ప్రయోగం చేయడం రిస్క్‌గానే ఉన్నా, ఆయన దైర్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ‘నాదానియా’లో నిరుత్సాహపరిచిన ఇబ్రహీం, ఈసారి మంచి మార్కులు కొట్టే అవకాశముంది.
తండ్రి సైఫ్ లాంటి సాలిడ్ విలన్‌గా పేరు తెచ్చుకోవాలంటే ఈ సినిమా అతనికి మెరుగైన అవకాశంగా మారొచ్చు. బాలీవుడ్‌లో సరిగ్గా స్థిరపడాలంటే నటనలో శ్రమతో పాటు మంచి ఎంపికలు కూడా అవసరమవుతాయి. ఇప్పుడు ‘సర్‌జమీన్’ ఆ మార్గంలో తొలి మెట్టు అవుతుందా, లేదా అనేది జూలై 25 తర్వాతే తెలుస్తుంది.


