
ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi) ఇటీవల ‘రంగమార్తాండ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే, తాజాగా ఆయన అల్లూరి సీతారామరాజు (Alluri Seetharama Raju) జీవిత గాథ ఆధారంగా ఓ సినిమా చేయాలనే తన కోరికను వెల్లడించారు. గతంలో ‘వందేమాతరం’ పేరుతో చిరంజీవితో ఓ దేశభక్తి చిత్రం చేయాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. అలాగే బాలకృష్ణతో ‘రైతు’ అనే సినిమాను ప్లాన్ చేసినా అది కూడా పట్టాలెక్కలేదు. అయితే, ఈసారి అల్లూరి సీతారామరాజు బయోపిక్‌ను నిజంగా తెరపైకి తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పరిశోధనలో భాగంగా కృష్ణవంశీ, ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ (Yandamuri Veerendranath) తో కలిసి అనకాపల్లి జిల్లా గొలగొండ మండలం మేజర్ పంచాయతీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ అల్లూరి సీతారామరాజు మరియు గంటం దొర సమాధులను వారు దర్శించుకున్నారు. ఈ సందర్శన అనంతరం కృష్ణవంశీ మాట్లాడుతూ, “అల్లూరి నడయాడిన ప్రదేశాలను చూడాలనే చిరకాల కోరిక ఇప్పుడే తీరింది” అని భావోద్వేగంగా అన్నారు.
కృష్ణవంశీ తనపై ప్రభావం చూపిన పుస్తకం గురించి ప్రస్తావించారు. సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన ‘ఆకుపచ్చ సూర్యోదయం’ పుస్తకం తనను ఎంతో ఆకట్టుకుందని, దాన్ని చదివిన తర్వాత అల్లూరి తిరిగిన ప్రదేశాలను చూడాలనే కోరిక బలపడిందని అన్నారు. ఈ జీవితగాథ ఆధారంగా సినిమా చేయాలనే ఆలోచన తనలో చాలా కాలంగా ఉందని, దానిపై కొంతకాలంగా పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణవంశీ ఈ బయోపిక్ కోసం ఎవరిని కథానాయకుడిగా తీసుకుంటారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. గతంలో చిరంజీవితో ‘వందేమాతరం’ చేయలేకపోయిన ఆయన, ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) తో అల్లూరి పాత్రను చేయించాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ ఇప్పటికే ‘RRR’ సినిమాలో అల్లూరి గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. దీంతో, కృష్ణవంశీ తెరకెక్కించే అల్లూరి పాత్రలో చెర్రీ అయితే బాగుంటుందని మెగాభిమానులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది? కథానాయకుడిగా ఎవరు నటిస్తారు? అన్నది సినిమా ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. కృష్ణవంశీ ఈ బయోపిక్‌ను అత్యున్నత స్థాయిలో తెరకెక్కించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు సమాచారం. వెండితెరపై అల్లూరి వీరత్వాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.