
సినిమా ఇండస్ట్రీ అంటే హీరోలను చుట్టూ తిరిగే వ్యవస్థ. ఏ సినిమా అయినా, ముఖ్యంగా హీరో స్టార్డమ్ పైనే ఆధారపడి ఉంటుంది. సినిమా ఎలా నడుస్తుందా? మార్కెట్ ఎలా జరుగుతుందా? జనాలు థియేటర్లకు ఎందుకు వస్తారు? అన్న ప్రశ్నలన్నీ హీరో ఎవరనే అంశంపైనే ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితిని ప్రతి దర్శకుడు అంగీకరించాల్సిందే. కానీ, సందీప్ రెడ్డి వంగా మాత్రం ఈ పరంపరను మార్చేలా ఉన్నాడు.
ఇటీవల సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit) సినిమాలో ప్రభాస్‌కి కొత్త షరతులు పెడుతున్నాడని టాక్. సాధారణంగా హీరోలు డిమాండ్ పెడతారు, కానీ ఇక్కడ సందీప్ రెడ్డీయే ప్రభాస్‌కి కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. తన సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రభాస్ మరో సినిమా చేయకూడదని, అలాగే ‘స్పిరిట్’ లుక్ చాలా ప్రత్యేకమైనదై ఉండబోతుందనీ, ఆ లుక్‌ను బయట ఎక్కువగా ప్రదర్శించకూడదని సందీప్ కండీషన్ పెట్టాడట.
సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌కి పెట్టిన మరో ముఖ్యమైన షరతు కాల్షీట్ల విషయంలో. సాధారణంగా హీరోలు వారానికి ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే కాల్షీట్లు ఇస్తారు. కానీ సందీప్ మాత్రం ఒకేసారి బల్క్‌గా కాల్షీట్లు కావాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు, బాడీ డబుల్స్‌పై ఆధారపడకుండా, ప్రతి సీన్ ప్రభాస్ నే చేయాలని స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాలన్నింటికీ ప్రభాస్ కూడా అంగీకరించినట్లు సమాచారం.
గత కొన్ని సినిమాల నుంచి ప్రభాస్ కాస్త రిలాక్స్ మోడ్‌లో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘రాజాసాబ్’ వంటి చిత్రాల సమయంలో మధ్యమధ్యలో విదేశీ ట్రిప్‌లు వెళ్లడం, సినిమాలు ఆలస్యం కావడం వంటి కారణాలతో సందీప్ ఈ కండీషన్లు పెట్టాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ప్రభాస్ కూడా సందీప్ పట్టుదల ఏమిటో తెలుసుకుని తనను పూర్తిగా సర్‌రెండర్ చేశాడని సమాచారం.
ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు హీరోల మెప్పేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సందీప్ రెడ్డి వంగా మాత్రం తాను నమ్మిన విధానానికి కట్టుబడి ఉంటాడు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘ఆనిమల్’ వంటి బోల్డ్ చిత్రాలు తీసిన సందీప్, తన కథను సరిగ్గా తెరకెక్కించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. అతని స్పష్టత, గట్స్ కారణంగా ప్రభాస్ కూడా పూర్తిగా అతని మాట విని స్పిరిట్‌లో పని చేయడానికి రెడీ అయ్యాడని టాక్.దర్శకుడి నియంత్రణలో పని చేసే హీరోలు తక్కువమంది. ఆ కోవలోకి ప్రభాస్‌ను చేర్చుకున్న సందీప్ రెడ్డి వంగా మరోసారి తన స్టైల్‌ను ప్రూవ్ చేసుకున్నాడని చెప్పొచ్చు