
న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2, 2025న ప్రారంభమైన ‘సెమీకాన్ ఇండియా 2025’ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశం భవిష్యత్తు కోసం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ చిప్ మార్కెట్‌లో భారతదేశం ప్రాధాన్యం పెరుగుతుందని, ట్రిలియన్ డాలర్ల సెమీకండక్టర్ రంగంలో దేశం ప్రముఖ పాత్ర పోషించబోతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు భారతదేశంపై విశ్వాసం ఉంచాయని, సెమీకండక్టర్ పరిశ్రమ భవిష్యత్తు కోసం దేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “గత శతాబ్దం చమురు ఆధారంగా రూపుదిద్దుకున్నప్పటికీ, భవిష్యత్తు చిప్‌ల ఆధారంగా నిర్మించబడుతుంది” అని స్పష్టం చేశారు. ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ ఇప్పటికే 600 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకుందని, త్వరలో 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటుతుందని అన్నారు. ఈ పెరుగుతున్న రంగంలో భారతదేశం ప్రధాన శక్తిగా మారబోతోందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
2021 నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం ఆమోదించిన 10 ప్రధాన సెమీకండక్టర్ ప్రాజెక్టుల కోసం 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించామని మోదీ తెలిపారు. నోయిడా మరియు బెంగళూరు వంటి నగరాల్లో ఉన్న చిప్ డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోని అత్యుత్తమ, అధునాతన చిప్‌ల తయారీపై దృష్టి సారించాయని ఆయన వివరించారు. భారతదేశం కేవలం చిప్ తయారీకి పరిమితం కాకుండా, పోటీతత్వంతో కూడిన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోందని అన్నారు.
ప్రధాని మోదీ ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ శక్తిని కూడా ప్రస్తావించారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశం 7.8% GDP వృద్ధిని నమోదు చేసిందని, ఇది ప్రపంచ అనిశ్చిత పరిస్థితుల మధ్య సాధించిన అద్భుత విజయం అని పేర్కొన్నారు. “భారతదేశం ఇప్పుడు తయారీ దేశంగా మారే దిశగా దృఢంగా ముందుకు సాగుతోంది” అని అన్నారు.
ఈ సమావేశాన్ని ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) మరియు SEMI సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 48 దేశాల నుండి 2,500 ప్రతినిధులు, 150 స్పీకర్లు, 350 ప్రదర్శనకారులు, మరియు 50 మంది గ్లోబల్ లీడర్లు పాల్గొంటున్నారు. ‘తదుపరి సెమీకండక్టర్ పవర్హౌస్ను నిర్మించడం’ ఈ కార్యక్రమం ప్రధాన థీమ్‌గా నిలిచింది.