
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ శాఖ అందించే సేవలు, చెల్లింపులు, ఫిర్యాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ వేదికను అందుబాటులోకి తెచ్చింది. పురపాలక శాఖ ఆధ్వర్యంలో ‘పురమిత్ర’ (Puramitra) మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. పన్నుల చెల్లింపులు, ఫిర్యాదుల నమోదు, పారిశుద్ధ్యం, వీధిదీపాలు, నీటి సరఫరా వంటి సేవలను ఇకపై ప్రజలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
ఫిర్యాదులకు డిజిటల్ సొల్యూషన్
పట్టణ ప్రజలకు పౌర సేవలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘పురమిత్ర’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. పౌర సేవలను మరింత సమర్థంగా అందించేందుకు, ప్రజల ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు దీన్ని రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత చాట్‌బోట్, ఆస్తిపన్నుల చెల్లింపు, నీటి సరఫరా ఛార్జీలు, ఇతర మున్సిపల్ రుసుముల చెల్లింపు వంటి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు.
రియల్ టైమ్ ట్రాకింగ్ సదుపాయం
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలలో నీటి సరఫరా, వీధిదీపాలు, పారిశుద్ధ్యం, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ వంటి సమస్యలను రియల్ టైమ్‌లోనే ట్రాక్ చేసే అవకాశం ఈ యాప్‌లో కల్పించారు. ప్రజలు తమ ఫిర్యాదులను ఫొటోలు, వివరాలతో నేరుగా పురపాలక శాఖకు పంపించవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పురమిత్ర
ఈ యాప్ ఆధునిక AI టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫిర్యాదులను కేటగిరైజ్ చేసి, వాటిని త్వరగా పరిష్కరించేలా రూపొందించారు. చెల్లింపులు, సేవల వివరాలు, ప్రభుత్వం విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్లను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
పౌర సేవలకు డిజిటల్ వేదిక
‘పురమిత్ర’ యాప్ ద్వారా ప్రజల అవసరాలను తక్షణమే తీర్చే విధంగా పురపాలక శాఖ కార్యాచరణ చేపట్టింది. ప్రజల అభిప్రాయాలను స్వీకరించే వీలును కూడా ఈ యాప్‌లో కల్పించారు. ఇకపై పౌర సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందనున్నాయి.