
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంఎస్హెచ్ఆర్ఐ) పథకం కింద రాష్ట్రానికి మరిన్ని పాఠశాలలు మంజూరయ్యే అవకాశముందని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి ప్రకటించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 953 పాఠశాలలు ఎంపిక చేయబడినట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో 29 పాఠశాలలు ఎంపిక అయ్యాయని చెప్పారు.
ఈ పాఠశాలల అభివృద్ధి కోసం రూ. 1620.6 లక్షలు వినియోగించనున్నట్లు వెల్లడించారు. పాఠశాలలు ఎంపిక ప్రక్రియ ‘ఛాలెంజ్ మెథడ్’ ద్వారా ఏడు దశల్లో చేపట్టినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 54 పాఠశాలలు ఎంపిక కాగా, విశాఖపట్నంలో 6 మాత్రమే ఎంపికైనట్లు గణాంకాలతో తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలల కోసం రూ. 3404.1 లక్షలు కేటాయించగా, ఇప్పటికే రూ. 1628.2 లక్షలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
ఈ పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్‌లు, స్మార్ట్ తరగతులు, డిజిటల్ బోర్డులు, గ్రంథాలయాలు, ఆటల మైదానాలు వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ స్కూల్స్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జాతీయ విద్యా విధానం 2020లోని అంశాల్ని ఈ పాఠశాలల్లో అనుసరిస్తున్నామని పేర్కొన్నారు.
పారదర్శక పోటీ పద్ధతిలో ఎంపిక చేసిన పాఠశాలల ద్వారా విద్యార్థులకు సమాన అవకాశాలు, నైపుణ్యాలు, ఆధునిక వనరులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సదుపాయాలపై ప్రతిపాదనలు సమర్పిస్తే, ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ఆమోదిస్తుందని స్పష్టం చేశారు.
ఈ పాఠశాలలు విద్యార్థుల బోధనతో పాటు వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని కేంద్ర మంత్రి తెలిపారు. స్మార్ట్ క్లాస్‌రూములు, ఔషధ తోటలు, గ్రీన్ కంపోస్టింగ్ యూనిట్లు వంటి అంశాలతో సమగ్ర అభివృద్ధికి దోహదపడేలా ఈ పాఠశాలలు రూపొందిస్తున్నట్లు వివరించారు. విద్యా రంగంలో రాష్ట్రానికి ఇది కీలక ముందడుగు అని అన్నారు.