
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాతబస్తీ అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేకించి మెట్రో పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు, వాటిని వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో, పలు ముఖ్యమైన అభివృద్ధి పనులపై చర్చ జరిగింది.
హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, సీఎం పలు సూచనలు చేశారు. నగరంలోని కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు కేబులింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నగరంలో నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా నియంత్రణ చేపట్టాలని, ఉద్దేశపూర్వకంగా అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముందస్తు ప్రణాళికలతో డీపీఆర్‌లు తయారుచేసి అభివృద్ధి పనులకు పునాది వేయాలని సూచించారు. పాతబస్తీలో మెట్రో పనులు జాప్యం కాకుండా తక్షణమే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖతో సమన్వయం చేస్తూ పునఃప్రారంభించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని సూచించారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సంబంధించి, గాంధీ సరోవర్ వరకు పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మూసీపై ప్రతిష్టాత్మకమైన ల్యాండ్ మార్క్ నిర్మించాలని, చార్మినార్ స్థాయిలో గుర్తింపునిచ్చే నిర్మాణం కావాలని తెలిపారు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీలు, అనుమతులు, నిబంధనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
మీరాలం ట్యాంక్ సమీపంలో ఆధునిక హోటల్ నిర్మాణం చేపట్టాలని, పర్యాటకులకు వసతులు కల్పించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభిప్రాయం. జూ పార్క్ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని, అన్ని పనులు సమగ్ర ప్రణాళికలతో నిర్వహించాలని స్పష్టం చేశారు. దీని ద్వారా పాతబస్తీ అభివృద్ధిలో కొత్త శకం మొదలవుతుందని చెబుతున్నారు.


