
మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాందేడ్‌లోని ప్రసిద్ధ తఖ్త్ సచ్ కండ్ గురుద్వారాను ఆదివారం భక్తిశ్రద్ధలతో దర్శించారు. సిక్కుల ఐదు అత్యున్నత పీఠాల్లో ఒకటైన హజూర్ సాహిబ్ గురుద్వారాలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో లీనమయ్యారు. సిక్కుల 10వ మత గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబా వారి సమాధి మందిరాన్ని దర్శించుకోవడం ఆయనకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.
శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ గారి 350వ షాహిదీ సమాగమంలో పాల్గొనేందుకు నాందేడ్‌కు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్న సమయంలో సచ్ ఖండ్ గురుద్వారాకు చేరుకున్నారు. గురుద్వారా ఛైర్మన్ డాక్టర్ విజయ్ సత్పాల్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనకు సిక్కు మత పెద్దలు సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ సిక్కు తలపాగాను ధరింపజేసి గౌరవించారు. అనంతరం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ గారితో కలిసి గురుద్వారాలోకి ప్రవేశించారు.
ప్రధాన మందిరంలో శ్రీ గురు గోవింద్ సింగ్ సాయిబాకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పవిత్ర చాదర్‌ను సమర్పించారు. గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, శ్రీ ఫడ్నవిస్ గారికి వేసి ఆశీర్వదించారు. సమాధి మందిరంలో ప్రదక్షిణ పూర్తి చేసిన అనంతరం, గురుద్వారా ఎదుట సిక్కులు అత్యంత పవిత్రంగా భావించే నిషాన్ సాహిబ్ ధ్వజానికి నమస్కరించారు.
దర్శనం అనంతరం గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ డొనేషన్ మెషీన్‌ను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఫడ్నవిస్ గారితో కలిసి ప్రారంభించారు. ఇది భక్తులకు సులభంగా దానాలు సమర్పించే అవకాశం కల్పించనుంది. ఈ సందర్భంగా గురుద్వారా నిర్వహణ కమిటీ ఆయన సేవాభావాన్ని ప్రశంసించింది.
మొదటిసారిగా సచ్ కండ్ గురుద్వారాకు విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సిక్కు మత పెద్దలు ఘనంగా సత్కరించారు. గురుద్వారా జ్ఞాపికతో పాటు పవిత్ర ఆయుధమైన కిర్పాన్‌ను బహూకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ గారి త్యాగం దేశమంతటికి స్ఫూర్తినిస్తుందని, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అలాంటి మహానీయుడి షాహిదీ సమాగమంలో పాల్గొనడం తనకు గొప్ప గౌరవమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు.


