
పల్నాడు జిల్లాకు వస్తే ప్రత్యేకమైన ఉత్సాహం, స్పందనలు కనిపిస్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వఛ్చాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై తన దృష్టిని వివరించారు. పల్నాడు చరిత్ర, సంస్కృతి, ప్రజల ఆత్మస్థైర్యం తనను ఎప్పుడూ ఆకర్షిస్తాయని తెలిపారు.
స్వర్ణాంధ్ర – స్వఛ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం స్వచ్చ రథాలను ప్రారంభించి, పారిశుద్ధ్య కార్మికులకు పుష్ కార్ట్స్ పంపిణీ చేశారు. ఉద్యానశాఖ స్టాల్స్‌ను పరిశీలించి, స్థానిక ఉత్పత్తులపై ఆసక్తి చూపారు. గుంటూరు కారం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వచ్చ సర్వేక్షణ్ 2047 బ్రోచర్‌ను ఆవిష్కరించి, రాష్ట్రం భవిష్యత్తులో పరిశుభ్రమైన దిశగా సాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాబోయే రోజులు వినుకొండకు మంచి రోజులేనని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే స్వర్ణాంధ్ర – స్వఛ్చాంధ్ర కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రతి మండలానికి ఒక స్వచ్చ రథం అందించి, ప్రతి వారం గ్రామాలన్నింటిలో తిరిగేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పల్నాడు అనగానే పౌరుషాల గడ్డ అని, కోటప్పకొండ తిరునాళ్లు అద్భుతంగా నిర్వహించారని గుర్తుచేశారు. శివరాత్రి ప్రభల కంటే కోటప్పకొండ ప్రభలు ఎంతో ప్రసిద్ధి గాంచాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్త సమస్యపై సీఎం స్పష్టంగా మాట్లాడారు. ప్రజలకు స్వచ్చమైన నీరు, స్వచ్చమైన గాలి అందించడమే తన లక్ష్యమన్నారు. మార్చి 31 నాటికి వంద శాతం ఇంటి నుంచి చెత్త సేకరణ చేపడతామని చెప్పారు. విశాఖలో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించామని గుర్తుచేశారు.
అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ప్రభుత్వ ప్రాధాన్యత అని సీఎం తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, ఎమ్మెల్యేలు ప్రజల మధ్య ఉండాలని సూచించామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి ఎకరాకు నీరు, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అగ్రిటెక్, అన్న క్యాంటీన్లు, స్త్రీ శక్తి వంటి కార్యక్రమాలతో రాష్ట్రంలో పెద్ద మార్పులు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


