
పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం గురువారం ఉదయం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం, డొక్కా సీతమ్మ, ఆదికవి నన్నయల వంటి ప్రముఖులు అంటూ గోదావరి ప్రాంత ప్రాధాన్యతను వివరించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల మేరకు ఏపీలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పర్యాటక ప్రాజెక్టులను చేపడుతున్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో డబుల్ ఇంజన్ సర్కార్ వేగంగా అభివృద్ధి పనులను అమలు చేస్తోందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ. 430 కోట్లతో పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి షెకావత్ ఇచ్చిన మద్దతును పవన్ అభినందించారు. అలాగే, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహకారం అందించిందని కొనియాడారు. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల నదీ తీరం ప్రాంతాన్ని విదేశాల్లోని నదీ తీరాల్లా పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయ పర్యాటక కేంద్రంగా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
ఈ సందర్భంగా గోదావరి నదిపై 127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ రైల్వే వంతెనను టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, బొమ్మూరులో రూ. 15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సైన్స్ మ్యూజియంను కేంద్ర మంత్రి షెకావత్, పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు. దివాన్ చెరువు వద్ద రూ. 30 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీకి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.
కాగా, ఈ కార్యక్రమానికి భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాజమండ్రి కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్ తెలిపారు. పుష్కర ఘాట్ వద్ద ప్లాస్టిక్ రహితంగా కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, తాగునీటి కోసం ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ బోట్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.


