
సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు. దేశంలోని 560 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, దేశాన్ని ఏకీకృతం చేసిన వ్యక్తిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. స్వాతంత్రం తరువాత కూడా ఆయన దేశ సమైక్యత కోసం నిరంతరం కృషి చేశారు. ఈయన చేసిన కృషి వల్లే నేటి భారతదేశం సమగ్రంగా ఉన్నదని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించబడింది. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు. మాధవ్ మాట్లాడుతూ, “సర్దార్ పటేల్ కలలు సాకారం చేయడం మనందరి బాధ్యత. ఆయన దేశ సమైక్యతకు ప్రతీక” అని అన్నారు.
మాధవ్ మరింతగా మాట్లాడుతూ, “దేశం విడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం పటేల్ చేసిన అద్భుతమైన చారిత్రాత్మక నిర్ణయం. నిజాం స్వయం ప్రతిపత్తి కోరినప్పుడు కూడా ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారు” అని అన్నారు. జమ్ము కాశ్మీర్ విషయంలో కూడా పటేల్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అయితే ఆ సమయంలో నెహ్రూ తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల సమస్య సంవత్సరాల పాటు కొనసాగిందని వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిగా విలీనం చేయడం పటేల్ కలలు నిజమైనట్లు మాధవ్ అన్నారు. ఆయన దేశ ప్రజలకు స్వదేశీ వస్తువులను వినియోగించాలని, “లోకల్ ఫర్ వోకల్” నినాదాన్ని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, “సర్దార్ పటేల్ దేశ సమగ్రతకు ప్రతీక. ఆయన త్యాగం, ధైర్యం, దృష్టి లేకపోతే నేటి భారత్ సాధ్యం అయ్యేది కాదు” అన్నారు. ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం మాదిరిగా ఏకతా ర్యాలీ నిర్వహించడం ఆయనకు నివాళి అని చెప్పారు. పటేల్ చూపిన మార్గంలో దేశం ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.


