
న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నాను. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అవసరమైన జీడి, మిర్చి, మామిడి బోర్డులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశాను. రైతుల ఆదాయం పెరగడానికి, ఎగుమతులు విస్తరించడానికి, అలాగే ఉత్పత్తికి సరైన విలువ దక్కేలా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని వివరించాను.
జీడిపప్పు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో రెండవ స్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో జీడి ఉత్పత్తి విస్తృతంగా జరుగుతోంది. కానీ ప్రాసెసింగ్ సౌకర్యాలు, ఆధునీకరణ, మరియు పారదర్శకమైన వ్యాపార పద్ధతులు లేకపోవడం వల్ల రైతులకు తగిన ధరలు అందడం లేదు. అందువల్ల శ్రీకాకుళంలో జీడి బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డాను.
అదేవిధంగా, గుంటూరు జిల్లా మిర్చి ఉత్పత్తిలో ప్రసిద్ధి పొందింది. ప్రపంచవ్యాప్తంగా గుంటూరులో ఉత్పత్తి అవుతున్న మిర్చికి మంచి డిమాండ్ ఉంది. అయితే మిర్చి రైతుల ఆదాయం స్థిరంగా ఉండటానికి, ఎగుమతులను పెంచడానికి ప్రత్యేక మిర్చి బోర్డు అవసరమని కోరాను. ఈ బోర్డు ద్వారా మార్కెట్ స్థిరత్వం కలిగి, అంతర్జాతీయ స్థాయిలో పోటీతత్వం మరింతగా పెరుగుతుందని నమ్ముతున్నాను.
చిత్తూరు జిల్లా మామిడి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే మామిడిని ప్రాసెసింగ్ చేసి, సప్లై చైన్‌ను బలోపేతం చేసి, ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వాన్ని పెంచడానికి మామిడి బోర్డు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని కోరాను. ఈ బోర్డు ఏర్పాటుతో రైతులకు తగిన ధరలు రావడంతో పాటు, మామిడి ఎగుమతులు కూడా విస్తరించే అవకాశముంది.
ఈ సమావేశంలో రాష్ట్రానికి అవసరమైన బోర్డుల ఏర్పాటు ద్వారా రైతులు లబ్ధిపొందేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ విజ్ఞప్తి చేశాను. పీయూష్ గోయల్ గారు నా అభ్యర్థనలను సానుకూలంగా స్వీకరించి పరిశీలన చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని మరింతగా బలోపేతం చేసి, రైతుల సంక్షేమానికి దోహదపడతాయని నమ్ముతున్నాను.


