
ఇటీవల వరుసగా థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి విజయాలు అందుకున్న నవీన్ చంద్ర, ఇప్పుడు మరోసారి “షో టైమ్” అనే విభిన్న కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “బ్లైండ్ స్పాట్”, “ఎలెవన్” చిత్రాలతో తన నటనా ప్రతిభను చాటిన ఆయన, ఇప్పుడు “షో టైమ్” అనే ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మదన్ దక్షిణామూర్తి దర్శకత్వం వహించగా, కిశోర్ గరికపాటి నిర్మిస్తున్నారు. స్కైలైన్ మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల, సీనియర్ నటుడు నరేశ్, రాజా రవీంద్ర వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీ టీ. వినోద్ రాజా నిర్వహించగా, శ్రీనివాస్ గవిరెడ్డి డైలాగ్స్ అందించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను ముగించుకొని జూలై 4న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఓ ప్రత్యేక ఈవెంట్లో ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే, ఇది ఒక ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. నాయకుడు ఇంట్లో ఉన్నపుడు అతని స్నేహితుడు అనుకోకుండా మరణిస్తాడు. ఈ ఘటన తర్వాత ఒక లాయర్‌ను సంప్రదించడం, ఆపై పోలీసులు విచారణ ప్రారంభించడం వంటి సంఘటనలతో కథలో మిస్టరీ పెరుగుతుంది. అసలు హత్య చేసింది ఎవరు? అనే ప్రశ్న చుట్టూ కథ తిరుగుతుంది. ఈ ఆసక్తికర కథాంశం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేయనుంది.
నవీన్ చంద్ర మరోసారి తన నటనతో మెప్పిస్తాడనే నమ్మకంతో, “షో టైమ్” ట్రైలర్‌తో పాటు సినిమాపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.