
‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ధీరజ్ మొగిలినేని మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో సంప్రదాయ పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ మొత్తం పాల్గొని చిత్ర విజయానికి దేవుని ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన సినిమా బృందానికి స్క్రిప్ట్ అందించగా, ముహూర్తపు సన్నివేశాన్ని ఎస్.కె.ఎన్. క్లాప్ ఇచ్చి ప్రారంభించారు. నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ నిర్మాణంలో భాగమైన ఈ ప్రాజెక్ట్‌కు గిరిబాబు వల్లభనేనితో కలిసి ధీరజ్ మొగిలినేని నిర్మాణ బాధ్యతలు చేపట్టడం సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ గురించి చెప్పుకుంటే, ఆయన సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి ‘కరెంట్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తరువాత సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో భారీ విజయం సాధించారు. ఆ తర్వాత నిఖిల్ హీరోగా తీసిన ’18 పేజీస్’ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, కథా ఎంపికలో వినూత్నతకు ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు స్వల్ప విరామం అనంతరం తన నాలుగో సినిమాగా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం విశేషం.
సంగీత్ శోభన్ విషయానికి వస్తే, స్వర్గీయ దర్శకుడు శోభన్ కుమారుడిగా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ‘మ్యాడ్’ సీరిస్ మూవీస్‌లో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇటీవల ‘గ్యాంబ్లర్’ చిత్రంలో నటించిన ఆయన ప్రస్తుతం నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఆ సినిమా కొనసాగుతుండగానే ధీరజ్ మొగిలినెనితో మరో ప్రాజెక్ట్ ప్రారంభం కావడం ఆయన కెరీర్‌కి మంచి అవకాశమని భావిస్తున్నారు.
ఈ కొత్త చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తుండగా, కథ–మాటలు లక్ష్మీ భూపాల్ అందిస్తున్నారు. యూత్‌ఫుల్ అంశాలతో పాటు భావోద్వేగాలు కలగలిసిన కథగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. సినిమా యూనిట్ నుంచి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉన్నప్పటికీ, ప్రారంభోత్సవం నుంచే ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ పెరుగుతోంది. మూవీ షూటింగ్ పూజా కార్యక్రమాలు విజయవంతంగా ముగియడంతో చిత్ర బృందం మంచి విజయంపై నమ్మకంగా ఉంది.


