
తెలంగాణ రాష్ట్ర నిర్మాణ చరిత్రలో డిసెంబర్ 9 ఒక అపూర్వమైన రోజు. తుది దశ తెలంగాణ ఉద్యమం ఉధృతమై, రాష్ట్ర ప్రజల సంకల్పం శిఖరానికి చేరిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు ఇదే. అందుకే ఈ రోజును విజయ్ దివస్ గా గుర్తుచేసుకుంటారు. ఈ ప్రకటన ఒక ప్రాంత హక్కుల కోసం జరిగిన దీర్ఘకాల పోరాటానికి మొదటి గెలుపు ఘడియగా నిలిచింది.
తెలంగాణ ప్రజలు వివిధ సబ్బండ వర్గాలకు చెందినవారు కలిసి చేసిన ఉద్యమం అపూర్వమైనది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, సింగరేణి కార్మికులు, మహిళలు—ప్రతి వర్గం సమాన భావోద్వేగంతో పోరాడింది. అమరుల త్యాగం ఈ ఉద్యమానికి హృదయం కాగా, అప్పటి తెలంగాణ ప్రజల ఏకగ్రీవ ధృఢసంకల్పం ఉద్యమాన్ని విజయ దిశగా నడిపింది. కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష ఢిల్లీ పీఠాన్ని కదిలించిన కీలక ఘట్టంగా నిలిచింది. ఆ దీక్షే కేంద్రాన్ని నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తీసుకెళ్లింది.
నవంబర్ 29 దీక్షా దివస్ అయితే, డిసెంబర్ 9 విజయ్ దివస్ కావడం యాదృచ్ఛికం కాదు. ఒకటి లేకుంటే మరొకటి అనే అనుబంధం ఈ రెండు రోజులకు ఉంది. కేసీఆర్ గారి దీక్ష ప్రజల్లో సంచలనాన్ని రేపి, ఉద్యమనికి శక్తివంతమైన దిశను ఇచ్చింది. ఆ ప్రజా తరంగమే డిసెంబర్ 9 ప్రకటనకు దారితీసింది. అందుకే ఉద్యమ చరిత్రలో ఈ రెండు తేదీలకు విడదీయలేని సంబంధం ఉందని భావిస్తారు.
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 కూడా రాదు. డిసెంబర్ 9న కేంద్రం తొలి అడుగు వేయడంతోనే ఏర్పాటుప్రక్రియ పురోగమించి, చివరకు 2014 జూన్ 2న తెలంగాణ ఒక వాస్తవంగా మారింది. ఈ కాలంలో జరిగిన ప్రతీ సంఘటన, ప్రజల ప్రతీ క్షణం పోరాటం, నాయకత్వం ప్రతీ నిర్ణయం వీటన్నీ కలిసి చివరకు తెలంగాణ ఆవిర్భావానికి కారణమయ్యాయి.
నేటి తరానికి డిసెంబర్ 9 ఒక చరిత్రగాథ మాత్రమే కాదు, సమష్టి సంకల్పం ఎలా రాష్ట్రాన్ని మార్చగలదో చూపించే ఉదాహరణ. ఈ విజయ దినోత్సవం తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రజాస్వామ్య భావజాలానికి ప్రతీకగా నిలుస్తోంది. జై తెలంగాణ!


