
దర్శి నియోజకవర్గ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఏపీ డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. సచివాలయంలో బుధవారం ఆయనను దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దర్శి ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. వెనుకబడిన దర్శి ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వారు తెలిపారు.
దర్శి నియోజకవర్గంలోని గ్రామీణ అంతర్గత రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత తాగునీటి సమస్యల పరిష్కారం వంటి అంశాలను డాక్టర్ లక్ష్మీ డిప్యూటీ సీఎంకు వివరించారు. అనేక గ్రామాల్లో ఇంకా పూర్తికాని రోడ్లు, డ్రైనేజీ పనులు ఉన్నాయని, వాటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈ బాధ్యతను స్వయంగా తీసుకుని అభివృద్ధిని వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులకు కీలక సూచనలు చేశారు. “ప్రజల నాడీ తెలిసిన యువ డాక్టర్లు మీరు. ప్రజలకు ఏం కావాలో మీకు తెలుసు. ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించాలి. ప్రజల ప్రతినిధులుగా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఇందుకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది” అని ఆయన భరోసా ఇచ్చారు. దర్శి అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
ఇటీవల తుఫాను ప్రభావంతో కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో కూలిపోయిన వాటర్ ట్యాంక్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కూడా డిప్యూటీ సీఎంను కోరారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.
అదేవిధంగా దర్శి ప్రాంతాన్ని ఒకసారి ప్రత్యక్షంగా పర్యటించాలని డిప్యూటీ సీఎంను కోరగా, త్వరలో దర్శి పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నామని డాక్టర్ లక్ష్మీ పేర్కొన్నారు. దర్శి ప్రాంతానికి రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి రానున్నాయనే ఆశాభావాన్ని ఈ సమావేశం కలిగించింది.


