
తెలుగింటి ఛానల్‌గా పేరుగాంచిన ఈటీవీ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో, ఛానల్ యాజమాన్యానికి, ఉద్యోగులకు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రజలకు వినోదం, సమాచారం, సంస్కృతి అందిస్తూ అగ్రగామిగా నిలిచిన ఈటీవీ ప్రయాణం నిజంగా గొప్పదని చెప్పాలి.
“ఈటీవీ-మీటీవీ” అనే నినాదంతో మొదలైన ఈ ప్రయాణం తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాధాన్యం ఇస్తూ అనేక వినూత్న కార్యక్రమాలను అందించింది. పండుగలు, ఆచారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించే షోలు, సీరియల్స్, రియాలిటీ ప్రోగ్రామ్స్ ద్వారా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. పాడుతా తీయగా వంటి సంగీత కార్యక్రమాలు అనేక ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకువచ్చాయి.
ఎన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ వచ్చినా ఈటీవీ రాత్రి 9 గంటల న్యూస్ బులెటిన్ తెలుగునాట నంబర్ వన్‌గా కొనసాగడం విశేషం. ఒకే బులెటిన్‌లో రోజంతా జరిగిన ప్రధాన సంఘటనలను సమగ్రంగా, విశ్వసనీయంగా అందించడం ద్వారా ఈటీవీ న్యూస్ ఒక ప్రత్యేకమైన బ్రాండ్‌గా నిలిచింది.
ఈ విజయాల వెనుక రామోజీ రావు గారి దూరదృష్టి, ఆవిష్కరణాత్మక ఆలోచనలు, విలువలు మరియు టీమ్ కృషి ప్రధాన కారణం. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈటీవీ ఈ ఉన్నత స్థాయికి చేరుకుంది.
సరికొత్త ఉత్సాహంతో, సృజనాత్మక ఆలోచనలతో, టీమ్ వర్క్‌తో ఈటీవీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులో కూడా తెలుగు ప్రేక్షకులకు మరిన్ని వినూత్నమైన, ఉత్తమమైన వినోదాన్ని అందిస్తూ, ప్రజల హృదయాల్లో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను.


