
గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పరిపాలనలో కీలకమైన సర్పంచ్‌లకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్‌లకు గుడ్ న్యూస్ చెప్పారు. గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచ్‌లకు నేరుగా నిధులు అందిస్తామని ప్రకటించారు. పెద్ద గ్రామాలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామాలకు రూ.5 లక్షలు చొప్పున ‘స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్’ కింద నిధులు ఇస్తామని తెలిపారు. ఈ నిధులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంబంధం లేకుండా నేరుగా సర్పంచ్‌లకే అందజేస్తామని స్పష్టం చేశారు.
గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం ప్రకటించారు. పేదల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి, పారదర్శక పరిపాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సర్పంచ్‌లు గ్రామ స్థాయిలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా కృషి చేయాలని సూచించారు.
‘మీ సహకారం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. 2009 నుంచి మీరు నన్ను మీ భుజాలపై మోశారు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు. కొడంగల్‌ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో వివక్ష లేకుండా, పార్టీలకు అతీతంగా పరిపాలన సాగాలని సూచించారు.
గ్రామాల అభివృద్ధికి సర్పంచ్‌లు ఐక్యతతో పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. పార్టీలు, పంతాలు పక్కన పెట్టి ప్రజల కోసం అంకితభావంతో సేవలందించాలని సూచించారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం గ్రామ పాలనలో సర్పంచ్‌ల పాత్రకు మరింత బలం చేకూర్చిందని పలువురు అభిప్రాయపడ్డారు.


